పుట:Oka-Yogi-Atmakatha.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శశి, మూడు నీలాలు

313

జరిగింది. భక్తు డెవరయినా మనసారా ప్రార్థించినప్పుడు అతని కోరిక తీర్చడంలో గురుదేవులు చూపించే దయకు అవధులు ఉండవు.

మా కాలేజి స్నేహితుల్ని గురుదేవుల దర్శనానికి తీసుకురావడం నాకు గర్వకారణంగా ఉండేది. వాళ్ళలో చాలామంది, మత విషయపరమైన సంశయశీలత అనే, విద్యావంతుల షోకు ముసుగును. కనీసం ఆశ్రమంలో!- తీసి పక్కకి పెట్టేసేవారు.

మా స్నేహితుల్లో ఒకరు శశి. చాలాసార్లు వారం చివరి సెలవు రోజులు శ్రీరాంపూర్‌లో హాయిగా గడిపేవాడు. గురుదేవులకు వాడంటే వల్లమాలిన ఇష్టం కలిగింది. కాని వాడి ఆంతరంగిక జీవితం విచ్చలవిడిగా, అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవారు.

“శశీ, నువ్వు కనక సరిగా మారకపోతే, ఇంకొక్క ఏడాదిలో నీకు చాలా పెద్దజబ్బు చేస్తుంది.” శ్రీ యుక్తేశ్వర్‌గారు మా స్నేహితుడివేపు, ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చూశారు. “దీనికి ముకుందుడు సాక్షి; ముందే హెచ్చరించలేదని తరవాత నన్ననకు.”

శశి నవ్వాడు. “గురుదేవా, నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతలిచేలా చేసే భారం మీ మీదే పెడుతున్నాను! నా అంతరాత్మ అంగీకరిస్తోంది, కాని నా మనస్సు బలహీనంగా ఉంది. ఈ లోకంలో మీ రొక్కరే నాకు రక్షకులు; మరి దేన్నీ నేను నమ్మను.”

“కనీసం రెండు కారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు, అది నీకు సాయపడుతుంది.”

“అది కొనే తాహతు నాకు లేదండి. అయినా గురుదేవా, కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.”