పుట:Oka-Yogi-Atmakatha.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

ఒక యోగి ఆత్మకథ

సామరస్యానికి, అంటే ఈడెన్ వాటికకు, చేర్చి అక్కడ పునఃప్రతిష్ఠ చెయ్యవలసిన వ్యక్తిగతమైన బాధ్యత ప్రతి మానవుడి మీదా ఉంది.

శ్రీ యుక్తేశ్వర్‌గారు తమ ప్రసంగాన్ని ముగించగానే నేను, జెనిసిస్ గ్రంథం పుటలవేపు కొత్త గౌరవంతో చూశాను.

“పూజ్య గురుదేవా, ఆదాము అవ్వల సంతానంగా వారిపట్ల నెరవేర్చవలసిన సముచితమైన కర్తవ్యం నా హృదయంలో ఇప్పుడు మొట్ట మొదటిసారిగా స్పందిస్తోంది."[1]

  1. హిందువుల “ఆదాము.అవ్వల” కథ శ్రీమద్భాగవతమనే సనాతన పురాణ గ్రంథంలో వర్ణించడం జరిగింది. మొట్టమొదటి పురుషుణ్ణీ స్త్రీని (భౌతిక రూపంలో ఉండడం వల్ల) స్వాయంభువ మనువు (“సృష్టికర్తలోంచి పుట్టిన మనిషి”) అనీ, అతని భార్య శతరూప అనీ పిలిచేవారు. వారి సంతానం ఐదుగురికీ ప్రజాపతులతో (స్థూల శరీరరూప ధారణకు సమర్థులైన పూర్ణజీవులు) అంతర్వివాహం జరిగింది. ఈ ప్రథమ దివ్య కుటుంబాల నుంచి మానవజాతి ఉద్భవించింది. క్రైస్తవ పవిత్ర గ్రంథాల్ని అత్యంత గాఢమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టితో శ్రీ యుక్తేశ్వర్‌గారు వ్యాఖ్యానించినట్టుగా, ప్రాచ్యదేశాల్లోకాని పాశ్చాత్య దేశాల్లో కాని మరొకరు వ్యాఖ్యానించినట్టుగా నే నెన్నడూ వినలేదు. “ ‘నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం; నా ద్వారానే తప్ప మరొక విధంగా ఎవ్వడూ తండ్రి దగ్గరికి చేరడు.’ (యోహాను 14 : 6) వంటి వాక్యాల్లో క్రీస్తు చెప్పిన మాటలకు దైవశాస్త్రజ్ఞులు తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు.” అని చెప్పారు మా గురుదేవులు. “తా నొక్కడే దేవుడి కుమారుడన్న అభిప్రాయం క్రీస్తుకు ఎన్నడూ లేదు; కాని మానవుడు ఎవడైనా సరే మొట్టమొదట ‘కుమార’ తత్త్వంగా రూపుగట్టక పోతే, అంటే సృష్టిలో కార్యప్రేరకమైన కూటస్థ చైతన్యంగా రూపుదాల్చకపోతే, నిర్గుణ పరబ్రహ్మను, అంటే సృష్టికి ‘అతీతంగా’ ఉన్న పరమపితను చేరుకోలేడు. కూటస్థ చైతన్యంతో సంపూర్ణ ఏకీభావం సాధించిన ఏసు, అంతకు చాలా కాలం క్రితమే అతని అహంభావం కరిగిపోయినందువల్ల, ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెందాడు.” “దేవుడు .... ఏసుక్రీస్తు ద్వారా సమస్త వస్తువులూ సృష్టించాడు” (ఎఫేసియన్స్ 3 : 9) అని పాల్ రాసినప్పుడూ, “అబ్రహాం కన్న ముందు కూడా నే నున్నాను” (యోహాను 8 : 58) అని ఏసుక్రీస్తు అన్నప్పుడూ, ఆ మాటల్లో సారాంశం, వ్యక్తిత్వలయమే. కర్మ సిద్ధాంతాన్ని గురించి, దానికి పర్యవసానమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని గురించి అవగాహన బైబిలులో అనేక సందర్భాల్లో కనబరచడం జరిగింది; ఉదా: “ఒకడి నెత్తురు పారించినవాడు, ఆ మనిషివల్లనే తన నెత్తురు ఓడుస్తాడు” (జెనిసిస్ 9 : 6) ప్రతి హంతకుడూ “మనిషివల్లనే” తను చావాలంటే, ఈ ప్రతి క్రియా ప్రక్రియకు సహజంగా, అనేక సందర్భాల్లో, ఒక జీవితంకన్న ఎక్కువ కాలం అవసరం. ఈ కాలపు పోలీసువాళ్ళు అంత చురుకుగా లేరు!

    క్రైస్తవ జ్ఞేయవాదులూ (నాస్టిక్స్), క్లీ మెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, సుప్రసిద్ధుడైన ఒరిజెన్ (ఇద్దరూ 3వ శతాబ్దివారే), సెంట్ జెరోమ్ (5వ శతాబ్ది) లతో సహా అసంఖ్యాకులైన క్రైస్తవ ధర్మ ప్రచారకులూ ప్రతిపాదించిన పునర్జన్మ సిద్ధాంతాన్ని తొలికాలపు క్రైస్తవ ధర్మ సంప్రదాయవాదులు అంగీకరించారు. ఈ సిద్ధాంతాన్ని ధర్మవిరుద్ధమని మొట్టమొదట ప్రకటించినది, క్రీ. శ. 553 లో కాన్‌స్టాంటినోపిల్‌లో ఏర్పాటయిన రెండో పరిషత్తు. ఈ పునర్జన్మ సిద్ధాంతం, మనిషి తక్షణ మోక్షం పొందేందుకు కృషి చెయ్యాలని ప్రోత్సహించడానికి అలవికానంత ఎక్కువ దేశ, కాల వ్యవధి ఇస్తోందని ఆ రోజుల్లో క్రైస్తవులు భావించారు. కాని సత్యాల్ని అణిచిపెట్టడంవల్ల అనేకమైన పొరపాట్లు జరిగి చిరాకుపెడతాయి. ఎంతో విశిష్టంగా సంపాదించి, ఎంతో త్వరగా శాశ్వతంగా పోగొట్టుకొనే “ఒక జీవిత కాలాన్ని” లక్షలాది జనం, ప్రపంచంలో తాము సుఖించడానికి వినియోగించుకున్నారే కాని, దేవుణ్ణి అన్వేషించడానికి వినియోగించుకోలేదు: మానవుడు దేవుడి కుమారుడిగా తన హోదాను తిరిగి సప్రయత్నంగా, సాధించేవరకు ఈ భూమి మీద మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండవలసిందే. ఇది సత్యం.