పుట:Oka-Yogi-Atmakatha.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

301

సాంఖ్యయోగం[1]లో ఒక సూత్రంలో ఇలా ఉంది: “ఈశ్వరాసిద్ధేః ”[2] ( “సృష్టికి అధినేత, అనుమాన ప్రమాణంచేత కనుక్కోడానికి వీలయినవాడు కాడు!” లేదా “ఈశ్వరుణ్ణి నిరూపించడానికి ప్రమాణం లేదు”). ముఖ్యంగా ఈ సూత్రం మీద ఆధారపడి చాలామంది విద్వాంసులు, దర్శన శాస్త్రాన్నంతనీ నాస్తికవాదం అనేస్తున్నారు.

“ఈ శ్లోకంలో నాస్తికగుణం లేదు,” అని వివరించారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “అందులో సూచించేదల్లా, తుదినిర్ణయాలన్నిటికీ ఇంద్రియ జ్ఞానం మీదే ఆధారపడి ఉండే అజ్ఞానికీ, ఈశ్వరుణ్ణి నిరూపించే ప్రమాణం అజ్ఞాతంగానే ఉంటుందని; కాబట్టి దానికి అస్తిత్వంలేదని, ధ్యానోత్పన్న మైన అచంచల అంతర్దృష్టిగల నిజమైన సాంఖ్య దర్శనానుయాయులు, ఈశ్వరుడు ఉన్నాడనీ, తెలుసుకోడానికి వీలయినవాడనీ కూడా గ్రహిస్తారు.”

మా గురుదేవులు క్రైస్తవుల బైబిలును చక్కని స్పష్టతతో వ్యాఖ్యానించేవారు. బైబిలులోని అమృతతత్త్వాన్ని దర్శించగలగడం, “స్వర్గం, భూమి గతించిపోతాయి కాని నా మాటలు మట్టుకు గతించిపోవు" [3]అంటూ ముందెవ్వరూ పలకనంత నిష్కర్షగా, అత్యంత హర్షదాయకంగా క్రీస్తు చేసిన ప్రవచనంలోని సత్యాన్ని అవగాహన చేసుకోడం నేను నేర్చుకున్నది, క్రైస్తవమత సభ్యత్వంతో ప్రమేయంలేని మా హైందవ గురుదేవుల దగ్గర.

  1. హిందూ తత్త్వశాస్త్రంలోని షడ్దర్శనాల్లో ఒకటి. ప్రకృతితో మొదలుకొని పురుషుడి (ఆత్మ) వరకు ఉండే ఇరవైఐదు తత్త్వాల పరిజ్ఞానం ద్వారా విముక్తి పొందవచ్చునని సాంఖ్యం ప్రబోధిస్తుంది.
  2. సాంఖ్యదర్శన సూత్రాలు, 1 : 92,
  3. మత్తయి 24 : 25.