పుట:Oka-Yogi-Atmakatha.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

297

“మానవుడి ఆత్మసాక్షాత్కారం ఎంత ఎక్కువ గాఢమైతే అంత ఎక్కువగా అతడు తన సూక్ష్మ ఆధ్యాత్మిక స్పందనలతో విశ్వాన్నంతనీ ప్రభావితం చేస్తాడు; తాను మాత్రం దృగ్విషయిక చాంచల్యానికి అంత తక్కువగా ప్రభావితుడవుతాడు.” గురుదేవులు చెప్పిన ఈ మాటలు తరచుగా జ్ఞప్తికి వస్తూ నాకు ఉత్తేజం కలిగిస్తూ ఉంటాయి.

అప్పుడప్పుడు నేను, గ్రహస్థితుల్ని బట్టి నా జీవితంలో అత్యంత దుష్కాలాలేవో గ్రహించి చెప్పమని జ్యోతిష్కుల్ని అడుగుతూండేవాణ్ణి. అయినా ఆ కాలాల్లో నేను ఏ పని తల పెట్టినప్పటికీ దాన్ని నెరవేరుస్తూ ఉండేవాణ్ణి. అటువంటి సమయాల్లో అసాధారణమైన కష్టాల్ని ఎదుర్కొంటేనే కాని, ఆ తరవాత విజయం సిద్ధించేదికాదన్నమాట నిజం. కాని నా ప్రగాఢ విశ్వాసం సమర్థనీయమైనదేనని ఎప్పుడూ రుజువవుతూ ఉండేది; దైవరక్షణమీద విశ్వాసం, మానవుడికి దేవుడిచ్చిన సంకల్పబలాన్ని సరిగా ఉపయోగించుకోడం అన్నవి రెండూ గ్రహస్థితుల ప్రభావాలకన్న ఎక్కువ బలిష్ఠమైనవి.

ఒకడి జననకాలంలో ఉన్న గ్రహస్థితికి అర్థం, మానవుడు తన గతం చేతిలో కీలుబొమ్మ అని కాదని నేను తెలుసుకున్నాను. నిజాని కది అతడు గర్వించదగ్గ సాధనం; మానవుడు ప్రతి ఒక్క బంధాన్నీ తెంచుకొని స్వేచ్ఛ పొందాలన్న సంకల్పం అతనిలో రగుల్కొల్పడమే దాని ఉద్దేశం. భగవంతుడు ప్రతి మనిషినీ ఆత్మగా సృష్టించాడు; ప్రత్యేక వ్యక్తిత్వం ప్రసాదించారు. కాబట్టి స్తంభంగానో పరాన్న భుక్కు గానో తాత్కాలిక పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ విశ్వవ్యవస్థ కది ఆవశ్యకమైనది. అతడు సంకల్పించినట్లయితే వెంటనే అంతిమస్వేచ్ఛ సంపాదించ గలడు; ఇది ఆంతరిక విజయాలమీదనే కాని బాహ్య విజయాలమీద ఆధారపడదు.