పుట:Oka-Yogi-Atmakatha.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

ఒక యోగి ఆత్మకథ

“నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని సరిపెట్టుకోడం మంచిది,” అని వ్యాఖ్యానించారు మా అనంతు అన్నయ్య. “నువ్వు చిన్నతనంలో మూడుసార్లు ఇల్లు విడిచి హిమాలయాలవేపు పారిపోతావనీ కాని బలవంతంమీద నిన్ను తిరిగి తీసుకొస్తారనీ నీ జాతకంలో రాసి ఉంది. సరిగా అలాగే జరిగింది. నీ పెళ్ళి విషయంలో చెప్పిన జోస్యం కూడా అలాగే నిజమయి తీరుతుంది,” అన్నాడు.

ఈ జోస్యం పూర్తిగా అబద్ధమని, ఒకనాటి రాత్రి నాకు స్పష్టంగా అంతస్ఫురణ కలిగింది. నా జాతకం రాసిన కాగితంచుట్టను కాల్చేసి, దాని బూడిద ఎత్తి, ఒక కాగితం సంచిలో పోసి, దానిమీద ఇలా రాశాను: “పూర్వకర్మ బీజాల్ని దివ్యజ్ఞానాగ్నిలో కాలిస్తే కనక అవి మళ్ళీ మొలకెత్తలేవు.” ఆ సంచీ, స్పష్టంగా కంటబడేచోట పెట్టాను. అనంతుడు వెంటనే నా ప్రతిఘటన వ్యాఖ్యను చదివాడు.

“నువ్వు జాతకం కాయితాన్ని కాల్చినంత సులువుగా సత్యాన్ని నాశనం చెయ్యలేవు.” అంటూ వెటకారంగా నవ్వాడు మా అన్నయ్య.

నేను పెద్దవాణ్ణి కాకముందు, మా వాళ్ళు నాకు పెళ్ళి చేయ్యడానికి మూడుసార్లు ప్రయత్నంచెయ్యడం యథార్థమే. దేవుడిమీద నాకున్న ప్రేమ, గతాన్ని బట్టి జ్యోతిషం ఇచ్చే ప్రోత్సాహంకన్న చాలా ఎక్కువన్న సంగతి తెలిసి నేను, ప్రతిసారీ వాళ్ళ పథకాలకు[1] లోబడకుండా తప్పుకున్నాను.

  1. మావాళ్ళు నా కిచ్చి పెళ్ళిచెయ్యాలని చూసిన పెళ్ళికూతుళ్ళలో ఒకమ్మాయికి, ఆ తరవాత మా పినతండ్రిగారి అబ్బాయితో పెళ్ళి అయింది. అతని పేరు ప్రధాన్‌చంద్ర ఘోష్. శ్రీ ఘోష్ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవచేస్తూ 1975 జనవరి 24 న కన్ను మూశారు (ప్రచురణకర్త గమనిక).