పుట:Oka-Yogi-Atmakatha.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

ఒక యోగి ఆత్మకథ

దర్శనం[1]కోసం చాలమంది భక్తులు వచ్చారు. జబ్బుతో బాధపడుతూ, నా సంగతి పట్టించుకునేవాళ్ళు లేక, అలా ఒక మూల కూర్చున్నాను. రాత్రి భోజనాలు అయాక కాని అతిథులు వెళ్ళలేదు. అప్పుడు మా గురుదేవులు, ఆ ఇంటికి అష్టభుజాకారంలో ఉన్న బాల్కనీలోకి రమ్మని పిలిచారు.

“నీ కాలేయం జబ్బుగురించి వచ్చి ఉంటావు.” శ్రీయుక్తేశ్వర్ గారి చూపు నన్ను తప్పించుకుంది; ఆయన అడపాతడపా, పడుతున్న వెన్నెలకు అడ్డువస్తూ, ఇటూ అటూ పచార్లు చేస్తున్నారు. “ఏది, ఇలా చూణ్ణియ్యి; నువ్వు ఇరవై నాలుగు రోజుల్నించి బాధపడుతున్నావుకదూ?”

“ఔనండి.”

“పొట్టకు సంబంధించి నేన్నీకు నేర్పిన వ్యాయామం చెయ్యి.”

“నే నెంత విపరీతంగా బాధపడుతున్నానో తెలిస్తే మీరు నన్నా వ్యాయామం చెయ్యమని అనేవారు కాదు. గురుదేవా!” అయినప్పటికీ ఆయన మాట మన్నించడానికి కొద్దిగా ప్రయత్నించాను.

“నొప్పి ఉందంటున్నావు నువ్వు, నీ కేమీ లేదంటున్నాను నేను. అటువంటి వైరుద్ధ్యాలు ఎలా ఉంటాయి?” మా గురుదేవులు నావేపు గుచ్చి గుచ్చి చూశారు.

నేను అప్రతిభుణ్ణయాను; నొప్పి మాయమయేసరికి ఆనందం పట్టలేకపోయాను. కొన్ని వారాలపాటు దాదాపు కంటికి కునుకు లేకుండా చేసిన ఎడతెగని యమబాధ మటుమాయమయిందని అనుభవమయింది. అటువంటి బాధ నా కెన్నడూ రానేలేదన్నట్టుగా, ఆయన మాటలతోనే మాయమయింది.

  1. ఒక సాధువును కేవలం చూసినంతమాత్రాన్నే లభించే అనుగ్రహం.