పుట:Oka-Yogi-Atmakatha.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

285

“సరైన రైలుబండి తప్పిపోయిన విద్యార్థులు కొందరు కాస్సేపట్లో ఇక్కడికి వస్తారనుకుంటాను. భోజనం సిద్ధంచేసి పెట్టుకుందాం.”

“గురూజీ, అర్ధరాత్రి ఒంటిగంటకి ఎవ్వరూ రారండీ!”

“నువ్వు పడుకో; ఇంతవరకు చాలా కష్టపడి పనిచేశావు. నేను మట్టుకు వంట చెయ్యడానికి వెడుతున్నాను.”

శ్రీయుక్తేశ్వర్‌గారి కంఠంలో స్థిరనిశ్చయం పొడగట్టేసరికి నేను చటుక్కున పైకి గెంతి, ఆయన వెనకాలే వంటగదికి వెళ్ళాను; రోజూ వాడుకునే ఆ చిన్న వంటగది, రెండో అంతస్తులో లోపలి బాల్కనీని ఆనుకుని ఉంది. కాస్సేపట్లో బియ్యం, పప్పూ ఉడుకు పట్టాయి.

మా గురుదేవులు ఆప్యాయంగా చిరునవ్వు నవ్వారు. “ఈ వేళ రాత్రి నువ్వు అలసటనీ, కష్టతర కార్యభయాన్నీ జయించావు; ఇక ముందెన్నడూ వాటివల్ల నువ్వు ఇబ్బంది పడవు.”

ఇలా ఆయన, యావజ్జీవిత ఆశీర్వచనాలు పలుకుతూ ఉండగానే ముంగిట్లో అడుగుల అలికిడి వినిపించింది. నేను పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి, వచ్చిన విద్యార్థి బృందాన్ని లోపలికి ప్రవేశపెట్టాను.

“తమ్ముడూ, ఈ సమయంలో గురువుగారిని ఇబ్బంది పెట్టాలంటే మనస్సు ఎంత పీకుతోందో తెలుసా! రైలు వేళల విషయంలో మీము పొరపాటు చేశాం; కాని గురుదేవుల దర్శనం చేసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేమనిపించింది,” అన్నారాయన.

“మీ కోసమే చూస్తున్నారాయన; మీ కోసం వంట కూడా చేస్తున్నారు.”

శ్రీ యుక్తేశ్వర్‌గారి స్వాగత స్వరం ఖంగున మోగింది. దిమ్మెర