పుట:Oka-Yogi-Atmakatha.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

ఒక యోగి ఆత్మకథ

చేస్తున్న వంటవాళ్ళకి కూడా ఉత్తేజం కలిగిస్తోంది. తోటి శిష్యులూ నేనూ ఆనందాతిశయంతో, చేతులతో తాళం వేస్తూ కీర్తనలు పాడాం.

పొద్దుగూకే వేళకి కొన్ని వందల మందికి కిచిడీ, కూర, పరమాన్నాలతో సంతర్పణ పూర్తిచేశాం. ముంగిట్లో ఆరుబయట జంబుఖానాలు పరిచాం; కొద్ది సేపట్లో, శ్రీయుక్తేశ్వర్‌గారి నోటినించి వెలువడే జ్ఞానోపదేశాల్ని ప్రశాంతంగా ఆలకించడానికి, చుక్కలు మెరిసే ఆకాశం కింద అందరూ ఆసీనులయారు. ఆయన బహిరంగోపన్యాసాలు క్రియా యోగానికి ఆత్మ గౌరం, ప్రశాంతత, దృఢనిశ్చయం, సాదా భోజనం, క్రమబద్ధమైన వ్యాయామంగల జీవితానికిఉన్న విలువను నొక్కి చెబుతాయి.

ఆ తరవాత శిష్యుల్లో కొందరు కొన్ని దైవస్తోత్రాలు గానం చేశారు; గాఢతత్పరత కలిగించే సంకీర్తనంతో సమావేశం సమాప్త మయింది. పది గంటలనుంచి అర్ధరాత్రి వరకూ ఆశ్రమవాసులు వంట పాత్రలన్నీ తోమి, ముంగిలి ఖాళీచేశారు. గురుదేవులు నన్ను దగ్గరికి పిలిచారు.

“ఈరోజూ, ఉత్సవసన్నాహాల్లో వారం రోజులపాటూ నువ్వు ఆనందంగా చేసిన శ్రమకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు నా దగ్గర ఉండాలని ఉంది; ఈ రాత్రి నువ్వు నా పక్కలో పడుకోవచ్చు.”

నాకు వస్తుందని ఎన్నడూ అనుకోని మహదవకాశమిది. మేము కొంతసేపు గాఢమైన దివ్య ప్రశాంతస్థితిలో కూర్చున్నాం. ఇక నిద్రకు ఉపక్రమిస్తూ మేము పడుకున్న సుమారు పది నిమిషాలకి గురుదేవులు లేచి మామూలు దుస్తులు వేసుకోడం ప్రారంభించారు.

“ఏమిటి గురుదేవా?” గురుదేవుల పక్కన పడుకుని నిద్రపోవడంలో గల ఆనందం, హఠాత్తుగా అవాస్తవికంగా పొడగట్టింది.