పుట:Oka-Yogi-Atmakatha.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

279

హిందూ సంగీతానికి ఆధారభూతమయినవి రాగాలు లేదా సంగీత స్వరగ్రామాలు. ఆరు మూలరాగాలూ 126 జన్యరాగాలుగా విడివడ్డాయి. వాటిని రాగిణులూ (భార్యలు) పుత్రులు అంటారు. ప్రతి రాగానికి కనీసం ఐదు స్వరాలుంటాయి: ప్రధాన స్వరం (వాది లేదా రాజు), ఆనుషంగిక స్వరం (సమవాది లేదా మహామంత్రి), సహాయక (అనువాది, సేవక) స్వరాలు, విరుద్ధ (వివాది, శత్రు) స్వరం.

మూలరాగాలు ఆరింటిలో ప్రతి ఒక్క దానికి రోజులో ఒక నిశ్చిత సమయానికీ, సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకూ, ఒకానొక విశిష్ట శక్తిని చేకూర్చే అధిదేవతకూ పొసగుదల ఉంటుంది. ఆ విధంగా, (1) హిందోళరాగం - విశ్వప్రేమ భావాన్ని కలిగించడానికి వసంతకాలంలో తెల్లారగట్ల వినిపిస్తూంటుంది; (2) దీపకరాగం - దయాభావాన్ని మేల్కొల్పడానికి వేసవికాలంలో సాయంత్రంపూట ఆలాపించడం జరుగుతుంది; (3) మేఘరాగం - ధైర్యం కలిగించడానికి వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలాపించవలసినది; (4) భైరవరాగం - ప్రశాంతత సాధించడానికి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పొద్దుటిపూట వినిపించేది; (5) శ్రీరాగం - పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునిమాపు వేళల్లో గానం చెయ్యడానికి నిర్దిష్టమైంది; (6) మాల్కోసు రాగం - శౌర్యం రేకెత్తించడానికి చలికాలం అర్ధరాత్రివేళల్లో వినిపిస్తుంది.

ప్రకృతికీ మనిషికీ మధ్యగల నాదమైత్రి తాలూకు ఈ నియమాల్ని సనాతన ఋషులు కనిపెట్టారు. ప్రకృతి ‘ఆదినాదం’ లేదా ‘స్పందనశీల శబ్దం’ అయిన ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావడంచేత మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాల్ని[1] ప్రయోగించి ప్రాకృతిక ప్రత్యక్ష విషయా

  1. ప్రకృతిమీద అధికారంగల మంత్రోచ్చారణల్ని గురించిన ప్రస్తావనలు అన్నిదేశాల ప్రజల జానపద వాఙ్మయంలోనూ ఉన్నాయి. వానకోసం, నీటికోసం అమెరికన్, ఇండియన్‌లు శాబ్దిక క్రతువులు కనిపెట్టిన సంగతి బాగా తెలిసిందే. హైందవ సంగీత విద్వాంసుల్లో మహనీయుడైన తాన్ సేన్, తన గాన శక్తితో మంటను ఆర్పగలిగినవాడు. కాలిఫోర్నియా ప్రకృతి శాస్త్రజ్ఞుడు చార్లెస్ కెలాగ్, 1926 లో నిప్పుమీద నాద స్పందనకు గల ప్రభావాన్ని, న్యూయార్క్ అగ్నిమాపక దళం వాళ్ళముందు ప్రదర్శించాడు. (“పరిమాణాన్ని విస్తృతంగా పెంచి చేసిన ఫిడేలుకమానులాంటిదాన్ని ఒక అల్యూమినియం ట్యూనింగ్ ఫోర్క్‌కి అడ్డంగా ఇటూఅటూ గబగబా ఆడించి, తీవ్రమయిన రేడియో స్థాయీ ధ్వనిలాంటి కీచుస్వరాన్ని పలికించాడు. గుల్లగా ఉన్న ఒక గాజు గొట్టంలో ఎగిరెగిరి పడుతున్న రెండడుగుల ఎత్తుగల పసుప్పచ్చటి గ్యాస్‌మంట, ఆరంగుళాల ఎత్తుకు తగ్గి గిలగిలకొట్టుకుంటూ నీలిమంటగా మారింది. అలాగే ఆ కమానుతో మళ్ళీ మరోసారి చేసేటప్పటికి కీచుస్వరంతో మరోసారి స్పందన వెలువడి మంటని ఆర్పేసింది."