పుట:Oka-Yogi-Atmakatha.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

277

డున్న విద్యార్థులూ అప్పుడు ఆయనదగ్గరికి చేరేవారు. మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్ లో జరిగింది; నేను హాజరయిన ఆ మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవన అందించింది.

కాళ్ళకి చెప్పులు లేకుండా వీధుల్లో పొద్దుటిపూట ఉరేగింపుతో ఉత్సవం ఆరంభమయింది. వందమంది విద్యార్థుల కంఠస్వరాలు మధురమైన సంకీర్తనలతో ఖంగున మోగాయి. సంగీతజ్ఞులు కొందరు పిల్లంగోవి, ఖోల్ కర్తాల్ (మద్దెలలూ తాళాలూ) వాయించారు. భగవంతుడి పావన నామ సంకీర్తనంతో మారుమోగేటట్టుగా మేముచేసే భజన తమకు పిలుపుగా ఎంచుకొని, నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటికి వచ్చిన ఉత్సాహవంతులైన ఊరి జనం, దారి పొడుగునా పూలు చల్లారు, ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిట్లో సమాప్తమయింది. అక్కడ మేము, మా గురుదేవుల చుట్టూ నిలబడ్డాం; మేడమీది బాల్కనీల్లో ఉన్న విద్యార్థులు మా మీద బంతిపూలు కురిపించారు.

చాలామంది అతిథులు, సెనగలూ నారింజ తొనలూ కలిపిచేసిన ఫలహారం తీసుకోడానికి మేడమీదికి వెళ్ళారు. నేను మాత్రం, ఆ రోజు వంటపని చేస్తున్న సోదరశిష్యుల బృందం దగ్గరికి దారితీశాను. అటువంటి పెద్ద సమారాధనలకీ అన్నం, ఆరుబయట పెద్ద పెద్ద గుండిగలతో వండాలి. తాత్కాలికంగా వేసిన ఇటిక పొయ్యిల్లోంచి పొగ కమ్ముకొస్తోంది; కళ్ళు నీళ్ళు కారిపోతున్నాయి; కాని మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం. భారతదేశంలో మతసంబంధమైన ఉత్సవాల్ని ఒక బెడదగా ఎన్నడూ భావించరు; ప్రతి భక్తుడూ తన వంతుకు తను సంతోషంగా చేస్తాడు.-- డబ్బిచ్చిగాని, బియ్యమూ కాయగూరలూ ఇచ్చిగాని, స్వయంగా నడుంకట్టి పనిచేసిగాని,

కాస్సేపట్లో గురువుగారు మా దగ్గరికి వచ్చారు, సంతర్పణకి