పుట:Oka-Yogi-Atmakatha.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

275

గురుదేవులు తమ శక్తుల్ని, ఎవరయినా సవాలు చేసినప్పుడుకాని, స్వల్ప విషయంలో కాని ఎన్నడూ ప్రదర్శించరని గ్రహించాను.

కొన్ని వారాలు ఆనందంగా చకచకా గడిచిపోయాయి. శ్రీ యుక్తేశ్వర్‌గారు మతసంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు. ఊళ్ళోనూ పూరీ సముద్రపు ఒడ్డునా శిష్యుల్ని తీసుకువెళ్ళి ఊరేగింపు నడిపించమని ఆయన నన్ను అడిగారు. పండుగ రోజున (కర్కాటక సంక్రమణం) తెల్లవారినప్పటినించే ఎండ మలమలమాడుస్తూ వచ్చింది.

“గురూజీ, కాళ్ళకి చెప్పులులేని విద్యార్థుల్ని నిప్పులా కాలుతున్న ఇసకలో ఎలా నడిపించమంటారు?” అని అడిగాను నిరాశగా.

“నీకో రహస్యం చెబుతాను,” అన్నారు గురుదేవులు. “ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బుల గొడుగు ఒకటి పంపిస్తాడు, మీరంతా సుఖంగా నడవచ్చు.” నేను సంతోషంగా ఊరేగింపు ఏర్పాటుచేశాను; మా బృందం సత్సంగ[1]పతాకంతో ఆశ్రమంనుంచి బయలుదేరింది. శ్రీయుక్తేశ్వర్‌గారు రూపకల్పనచేసిన ఈ పతాకంలో ఏకైక[2]నేత్రం చిహ్నం ఉంది; అదే సహజావబోధం తాలూకు దూరదర్శక దృష్టి.

  1. ‘సత్’ అన్నదానికి వాచ్యార్థం, “అస్తిత్వం”; కాబట్టి “సారం, సత్యం”: ‘సంగ’ శబ్దానికి అర్థం- “కూటమి”. శ్రీ యుక్తేశ్వర్‌గారు తమ ఆశ్రమ వ్యవస్థను సత్సంగమని పిలిచేవారు; అంటే “సత్యంతో సాంగత్యం" అన్నమాట.
  2. “కాబట్టి నీది ఒక్కటే కన్ను అయినట్లయితే (నీ దృష్టి ఏకాగ్రమయి నట్లయితే) నీ ఒళ్ళంతా వెలుగుతోనే నిండి ఉండాలి.” - మత్తయి 6:22. గాఢంగా ధ్యానం చేసే సమయంలో నుదుటికి నడుమ ఒంటికన్ను లేదా జ్ఞాననేత్రం అవుపడుతుంది. సర్వదర్శకమైన ఈ కంటినిగురించి పవిత్ర గ్రంథాల్లో మూడోకన్ను అనీ, తూర్పుచుక్క అనీ, లోపలికన్ను అనీ, స్వర్గంనుంచి దిగివస్తున్న పావుర మనీ, శివుడికన్ను అనీ, సహజావబోధ (అంతర్జ్ఞాన) నేత్రమనీ ఇంకా ఇలా రకకాలుగా ప్రస్తావించారు.