పుట:Oka-Yogi-Atmakatha.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

ఒక యోగి ఆత్మకథ

చూడాలని ఆశించం. దానికి కారణమేమిటంటే, అనుకోని, అపరిచితమైన యథార్థమేదయినా అవుపడితే వెంటనే దాన్ని మనం, గడించిన జ్ఞానంలో సర్వసామాన్యాల చట్రాల్లో ఇమడ్చడానికి పూనుకుంటాం. ఎవరయినా ఇంకా పరిశోధన చెయ్యడానికి సాహసిస్తారంటే ఈసడిస్తాం.”

నమ్మశక్యంకాని విధంగా నా గోబిపువ్వు ఒకటి దొంగతనమయిన కొన్నాళ్ళకి నవ్వొచ్చే సంఘటన ఒకటి జరిగింది. కావలసిన కిరసనాయిలు దీపం ఒకటి కనిపించలేదు. అంతకుముందే గురుదేవుల సర్వజ్ఞ యోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తరువాత, ఈ దీపాన్ని కనిపెట్టడం చిన్న పిల్లల ఆటకింద ఆయన చూపిస్తారని అనుకున్నాను.

గురుదేవులు నేను ఆశించినదాన్ని గమనించారు. తెచ్చి పెట్టుకున్న అతిగాంభీర్యంతో ఆశ్రమవాసులందరినీ నిగ్గదీసి అడిగారు. శిష్యుల్లో ఒక కుర్రవాడు, దొడ్లో నూతి దగ్గరికి వెళ్ళడానికి దీపం తీసుకువెళ్ళానని చెప్పాడు.

శ్రీయుక్తేశ్వర్‌గారు, “దీపంకోసం నూతి దగ్గర చూడండి,” అని గంభీరంగా సలహా ఇచ్చారు.

చటుక్కున అక్కడికి ఉరికాను; దీపం లేదు. మొహం వేలాడేసుకుని మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చాను. ఇప్పుడాయన పగలబడి నవ్వుతున్నారు. నా భ్రమ తొలగిపోయినందుకు అనుతాపమేమీ లేకుండా.

“ఇదేం బాగాలేదు; మాయమైన దీపం దగ్గరికి నిన్ను పంపించలేకపోయాను; నేను సోది చెప్పేవాణ్ణి కాకపోతిని!” మిలమిల్లాడుతున్న కళ్ళతో, ఆయన ఇంకా అన్నారు. “కనీసం సరయిన షెర్లాక్ హోమ్స్ నయినా కాను!”