పుట:Oka-Yogi-Atmakatha.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

ఒక యోగి ఆత్మకథ

బోయేది ముందుగానే సరిగా “స్ఫురించడం,” తమ ఆలోచనల్ని మరో మనిషికి కచ్చితంగా బదిలీచెయ్యడం లాంటి అనుభవం కలిగే ఉంటుంది.

అలజడులు లేని, లేదా అశాంతి, ఒత్తిడి నుంచి విముక్తమయిన మానవ మనస్సుకు, సహజావబోధమనే యాంటినా ద్వారా, జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులన్నిటినీ చేసే శక్తి ఉంటుంది; అంటే, ఆలోచనారూప సందేశాలు పంపడం, అందుకోడం, అక్కర్లేనివాటిని రానివ్వకపోవడం చెయ్యగలుగుతుందన్న మాట. రేడియో ప్రసార కేంద్ర శక్తి అది వినియోగించుకోగలిగిన విద్యుచ్ఛక్తి పరిమాణంచేత నియంత్రితమైనట్టుగానే మానవరూపంలో ఉన్న రేడియో సామర్థ్యం, ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సంకల్పశక్తి ప్రమాణంమీద ఆధారపడి ఉంటుంది.

అన్ని ఆలోచనలూ విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ ఉంటాయి. సిద్ధపురుషుడైనవాడు గాఢమైన ఏకాగ్రతతో, బతికున్న వాడివయినా చనిపోయినవాడినయినా సరే - ఏ మనిషి ఆలోచనలనయినా సరే- పసిగట్ట గలుగుతాడు. ఆలోచనలన్నవి వైయక్తికంగా కాక, విశ్వవ్యాప్తంగా వేరూనినవి. సత్యాన్ని దర్శించడమే కాని సృష్టించడం శక్యం కాదు. మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదయినా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం; ఆ లోపం పెద్దదయినా కావచ్చు. చిన్నదయినా కావచ్చు. అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేటందుకు మనస్సును శాంతపరచడమే యోగశాస్త్రం లక్ష్యం.

రేడియో, టెలివిజనూ, దూరంగా ఉన్న మనుషుల ధ్వనినీ ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షల ఇళ్ళలోకి తెస్తున్నాయి: మానవుడు సర్వవ్యాపకమైన ఆత్మ అన్నదానికి ఇది, వైజ్ఞానికమైన మొట్టమొదటి అస్పష్ట సూచన. అహంకారం మనిషిని బానిసని చేసుకోడానికి అత్యంత పాశవిక పద్ధతుల్లో, కుట్ర పన్నుతున్నప్పటికీ అతడు ప్రధానంగా సర్వ