పుట:Oka-Yogi-Atmakatha.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

267

చాలామంది యువశిష్యులూ నేనూ చెదిరిపోయిన గుంపులా ఆయన వెంట నడిచాం. మా గురుదేవులు సున్నితమైన విమర్శా ధోరణిలో మమ్మల్ని పరిశీలించారు.

“మన పాశ్చాత్య సోదరులు, నడిచేటప్పుడు మూమూలుగా ఒక క్రమపద్ధతి ననుసరించడం గర్వకారణంగా భావిస్తారు. మీరుకూడా ఇప్పుడు రెండు వరసల్లో కవాతు చెయ్యండి; ఒకరితో ఒకరు లయబద్ధంగా అడుగు వేస్తూ ఉండండి.” మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్‌గారు మా మీదే కన్నుంచి, “బాబులూ నడవండి ముందుకీ వెనక్కీ, అందంగా వరసకట్టి అడుగడుక్కీ,” అంటూ పాడడం ప్రారంభించారాయన. గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచకా సునాయాసంగా అంగవెయ్యడం చూస్తుంటే ముగ్ధుణ్ణికాక మానలేదు.

“ఆగండి!” మా గురువుగారి కళ్ళు నా కళ్ళలోకి చూశాయి. “ఆశ్రమం దొడ్డి తలుపు మరిచిపోకుండా తాళం వేశావా?”

“వేశాననుకుంటానండి.”

శ్రీయుక్తేశ్వర్‌గారు కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉన్నారు. ఆయన పెదవులమీద చిరునవ్వు కొంతమట్టుకు బిగబట్టి ఉంది. “లేదు, నువ్వు మరిచిపోయావు,” అన్నారాయన చివరికి. “భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవచింతనని సాకుగా తీసుకోకూడదు. ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు. నిన్ను శిక్షించాలి.”

ఆ తరవాత, “నీ గోబిపువ్వులు ఆరూ త్వరలో అయిదయిపోతాయి.” అని ఆయన అన్నప్పుడు అస్పష్టంగా, పరాచకమాడుతున్నా రనుకున్నాను.

గురుదేవుల ఉత్తరువుల మేరకు మేము వెనక్కి తిరిగి నడక సాగించాం; ఆశ్రమం దగ్గరికి వచ్చాం.