పుట:Oka-Yogi-Atmakatha.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

ఒక యోగి ఆత్మకథ

వచ్చు– అయినప్పటికీ ఈశ్వరుడు చిక్కకుండానే ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రగతిని బాహ్యశక్తుల ప్రదర్శననిబట్టి కాకుండా, కేవలం ధ్యానంలో కలిగే ఆనందగాఢతనుబట్టి మాత్రమే గణించాలి.

“నిత్య నూతనానందమే దేవుడు. ఆయన అక్షరుడు; ఇకముందు సంవత్సరాల్లో నువ్వు ధ్యానసాధన కొనసాగిస్తూ పోయినకొద్దీ ఆయన అనంతమైన చాతుర్యంతో నిన్ను మాయచేస్తూ ఉంటాడు. దైవసాక్షాత్కారం పొందే మార్గం కనుక్కున్న నీలాంటి భక్తుడు మరే సుఖంకోసమూ దేవుణ్ణి వదులుకోడు; ఆయన, పోటీనిగురించిన ఆలోచనకే అతీతంగా, మోహంలో పడేస్తాడు.

“ప్రాపంచిక సుఖాలతో ఎంత తొందరగా విసిగిపోతామో! భౌతిక వస్తువులకోసం కలిగే కోరికకు అంతులేదు; మనిషి ఎన్నడూ పూర్తిగా తృప్తిపడలేడు; ఒక గమ్యం తరవాత మరో గమ్యానికి పాకులాడతాడు. అతడు అన్వేషించే “ఆ మరొకటి” ఈశ్వరుడే; శాశ్వతానందాన్ని ప్రసాదించగలవాడు ఆయనొక్కడే.

“బాహ్య కామనలు మనని లోపలున్న, ‘స్వర్గం’ నుంచి తరిమేస్తాయి; అవి కేవలం ఆత్మానందపాత్రను అభినయించే మిథ్యాసుఖాల్ని మాత్రమే చేకూరుస్తాయి. పోయిన స్వర్గాన్ని దైవధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది. దేవుడు, ముందుగా ఊహించడానికి వీలులేని నిత్యనూతనత్వం కావడంవల్ల ఆయనంటే మనకెన్నడూ విసుగుపుట్టదు. అనంత కాలమంతటా సంతోషభరితంగా వైవిధ్యం చూపించే పరమానందం మనకు ఎక్కసం కావడం సాధ్యమా?”

“ఈశ్వరుడు అవగాహనకు అతీతుడని సాధువులు ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకున్నానండి. ఆయన్ని అంచనా వెయ్యడానికి చిరంతన జీవితం కూడా చాలదు.”