పుట:Oka-Yogi-Atmakatha.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

ఒక యోగి ఆత్మకథ

“నాకు తెలుసులే, నువ్వెలా ధ్యానం చేస్తున్నావో; తుఫానులో అల్లల్లాడిపోతున్న ఆకుల్లా చెదిరిపోతోంది నీ మనస్సు,” అంటూ కేక వేశారు గురుదేవులు.

భంగపడి, బయటపడి, విచారంగా ఆయన దగ్గరికి వెళ్ళాను.

“వెర్రినాయనా, నీకు కావలసింది కొండలు ఇయ్యలేవు.” గురుదేవులు బుజ్జగింపుగా, ఓదార్పుగా పలికారు. ఆయన చల్లని చూపు అంతు తెలియనంత లోతుగా ఉంది. “నీ హృదయాభిలాష నెరవేరుతుంది.”

శ్రీయుక్తేశ్వర్‌గారు గూఢంగా మాట్లాడడం అరుదు; నేను కలవరపడ్డాను. ఆయన నా గుండెకు పై భాగంలో సుతారంగా చేత్తో తట్టారు.

నా శరీరం కదలకుండా పాతుకుపోయింది; నా ఊపిరితిత్తుల్లోంచి నా శ్వాస, ఏదో ఒక పెద్ద అయస్కాంతంతో బయటికి లాగేసినట్లయింది. నా ఆత్మా, మనస్సూ తక్షణమే వాటి భౌతికబంధాన్ని కోల్పోయి, ద్రవరూప కాంతికిరణాల మాదిరిగా నాలో ప్రతి రంధ్రంలోంచి బయటికి ప్రసరించాయి. నాలో ఉన్న కండ నిర్జీవమైపోయినట్టు ఉన్నా, అంతకు ముందెన్నడూ నేను అంతటి సంపూర్ణ చైతన్యంతో తొణికిసలాడలేదని నాకు కలిగిన ప్రగాఢ స్పృహవల్ల తెలుసుకున్నాను. నా తాదాత్మ్యబోధ, ఒక శరీరానికి సంకుచితంగా కట్టుబడి ఉండకుండా చక్రగతిలో సంచలించే అణువులకు కూడా విస్తరించింది. దూరాన వీథుల్లో ఉన్న జనం, నా దూరపరిధి మీదే మెల్లగా కదులుతున్నట్టు అనిపించింది. మట్టికున్న మంద పారదర్శకత వల్ల మొక్కలవేళ్ళూ చెట్లవేళ్ళూ భూమిలోంచి స్పష్టంగా కనిపించాయి; వాటి జీవరస ప్రవాహాన్ని కూడా గమనించాను.

చుట్టుపక్కల ప్రదేశమంతా నా ముందు బట్టబయలుగా ఉంది. మామూలుగా ఎదుటఉన్న వాటిని మాత్రమే చూడగల నా చూపు ఇప్పుడు