పుట:Oka-Yogi-Atmakatha.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

ఒక యోగి ఆత్మకథ

ఎకౌంటెంటు. “వెనకటినించి పరిహారంగా ఆయనకి చెల్లించవలసినవి 1,25,000 రూపాయలు.” ఆ మొత్తానికి, కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే, ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మరిచిపోయారు. తరవాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు, నాన్న గారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి, బ్యాంకువాళ్ళు పంపిన స్టేట్‌మెంటులో చూసి, దాన్నిగురించి నాన్నగారి నడిగాడు.

“భౌతికమైన లాభాల్ని చూసి పొంగిపోవడం ఎందుకు?” అని జవాబిచ్చారాయన. “అన్నిటి విషయంలోనూ సమదృష్టితో ఉంటూండే వాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు; నష్టం వచ్చినప్పుడు కుంగి పోడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడనీ, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడనీ అతనికి తెలిసి ఉంటుంది.”

దాంపత్య జీవితంలోని తొలినాళ్ళలో మా అమ్మా నాన్నగారూ కాశీలో ఉండే లాహిరీ మహాశయులనే మహాగురువులకు శిష్యులయారు. సహజంగా నాన్నగారికుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యంవల్ల మరింత బలపడింది. అమ్మ ఒకసారి, పెద్దక్క - రమకి ఒక గొప్ప విషయం చెప్పింది: “మీ నాన్నగారూ నేనూ భార్యాభర్తలుగా కలిసేది ఏడాది కొక్కసారి మాత్రమే; పిల్లలకోసమని!”

నాన్నగారు లాహిరీ మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది, అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగిద్వారా. గోరఖ్‌పూర్‌లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేకమంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకొనేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తూండేవారు. కథ చెబుతూ చిట్టచివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తూండేవారు.