పుట:Oka-Yogi-Atmakatha.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వచేతనానుభవం

253

పనులవల్ల ఎంతో అసౌకర్యానికి గురిఅయి కూడా రవ్వంత విసుగయినా చూపించలేదు.”

మేము ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం; వాటిలో కన్నీళ్ళు మెరుస్తున్నాయి. ఒకానొక ఆనంద తరంగం నన్ను ముంచెత్తింది. ఈశ్వరుడు నా గురుదేవుల రూపంలో, నా హృదయంలోని స్వల్పమైన ఉత్సాహాల్ని అవధులులేని విశ్వప్రేమ సీమలుగా విస్తరింపజేస్తున్నా డన్న సంగతి నాకు స్పృహలోకి వచ్చింది.

కొన్నాళ్ళ తరవాత ఒకరోజు పొద్దున నేను మా గురుదేవులు మామూలుగా కూర్చునే గదికి దారి తీశాను. ఖాళీగా ఉన్న ఆ గదిలో ధ్యానం చేసుకోవాలని నా ఉద్దేశం; కాని చెప్పుచేతుల్లో లేని నా ఆలోచనలు, మెచ్చుకోదగ్గ నా ఉద్దేశంతో సహకరించడం లేదు. వేటగాణ్ణి చూసిన పక్షుల్లా చెల్లాచెదరవుతున్నాయవి.

“ముకుందా!” దూరంగా ఉన్న బాల్కనీనుంచి శ్రీ యుక్తేశ్వర్ గారి గొంతు వినిపించింది.

నా ఆలోచనల్లాగే నాలో కూడా తిరుగుబాటు ధోరణి తలెత్తింది. “గురువుగారెప్పుడూ నన్ను ధ్యానం చెయ్యమని చెబుతూంటారు. తీరా నేను తమ గదిలోకి ఎందుకువచ్చానో తెలిసి కూడా ఆయన చెడగొట్టగూడదు,” అని గొణుక్కున్నాను.

ఆయన మళ్ళీ పిలిచారు నన్ను; నేను మొండికేసి, చప్పుడు చెయ్యకుండా ఊరుకున్నాను. మూడోసారి ఆయన గొంతులో మందలింపు కూడా మిళితమై ఉంది.

“నేను ధ్యానం చేసుకుంటున్నానండి,” అభ్యంతరం చెబుతున్న ధోరణిలో అరిచాను.