పుట:Oka-Yogi-Atmakatha.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిద్రపోని సాధువు

251

“నిన్ను ఉత్తి చేతులలో వెళ్ళనియ్యను.” ఆ యోగి మార్దవం ఉట్టిపడేలా అన్నారు. “నీకు ఏదో ఒకటి చేస్తాను.”

ఆయన చిరునవ్వు నవ్వి నావేపు నిలకడగా చూశారు. నేలకు పాతుకుపోయినట్టుగా నేను కదలికలేకుండా అయిపోయాను; ఆ సాధు పుంగవుల దగ్గరినుంచి ప్రసరించే శాంతి స్పందాలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి. ఏళ్ళతరబడి అడపాతడపా నన్ను బాధపెడుతూ ఉన్న వెన్ను నొప్పి తక్షణమే మటుమాయమయింది.

పునరుజ్జీవితుణ్ణి అయి, తేజోమయమైన ఆనందసాగరంలో స్నానం చేసి, మరింక ఏడవలేదు. రామగోపాల్‌గారి పాదాలు తాకి, అడవిలో అడుగుపెట్టాను. తారకేశ్వర్ చేరేదాకా, చెట్ల గుబురుల్లోంచి ఎన్నో వరి పొలాల మధ్యనుంచీ దారి చేసుకుంటూ ముందుకు సాగాను.

అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి, లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ గుండ్రటిరాయి నా అంతర్దృష్టిలో పెరిగిపెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది: వలయంలో వలయం, మండలంలో మండలం- అన్నిటా దైవత్వం తొణికిసలాడుతున్నది.

మరో గంటకి నేను సంతోషంగా, కలకత్తా వెళ్ళడానికి రైలు ఎక్కాను. ఇక నా ప్రయాణాలు ముగిసిపోయాయి; ఉన్నత పర్వతాల్లో కాదు, మహోత్తుంగ హిమవన్నగం వంటి మా గురుదేవుల సన్నిధితో.