పుట:Oka-Yogi-Atmakatha.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

ఒక యోగి ఆత్మకథ

అనే లక్ష్య నక్షత్రంమీదే లగ్నం చెయ్యి. నువ్వు కష్టపడి కృషిచేస్తే దాన్ని అందుకుంటావు.”

భావి అవకాశానికి ముగ్ధుణ్ణి అయి, ప్రబోధాత్మకమయిన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన్ని కోరాను. ఆయన, లాహిరీ మహాశయుల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కలుసుకోడాన్ని గురించిన అద్భుతమైన కథ చెప్పారు నాకు.[1] ఇంచుమించు అర్ధరాత్రివేళ రామగోపాల్‌గారు మౌనంలోకి వెళ్ళిపోయారు; నేను నా కంబళ్ళమీద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు తళతళలాడే మెరుపులు కనిపించాయి; నాలో ఉన్న విశాలాకాశం కాంతిని కరిగిపోసిన గదిలా ఉంది. కళ్ళు తెరిచాను; కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతినే అప్పుడు కూడా గమనించాను. ఆ కుటీరం గది, అంతర్దృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమై పోయింది.

“నిద్రపోవేం?” అని అడిగారు యోగివర్యులు.

“అయ్యా, నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తళ తళ లాడుతూంటే ఎలా నిద్రపోగలను?”

“ఈ అనుభవం కలగడం నీకు ఆశీఃప్రసాదం. ఆధ్యాత్మిక తేజఃప్రసరణలు సులువుగా కనిపించవు. ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు.

తెల్లారగట్ల రామగోపాల్‌గారు నాకు పటికబెల్లం ముక్కలు పెట్టి, నన్నింక బయలుదేరమని చెప్పారు. నా చెంపలమీదగా కన్నీళ్ళు కారుతూ ఉండగా ఆయనదగ్గర సెలవు తీసుకోడానికి కూడా నాకు మనస్సు ఒప్పలేదు.

  1. 33 ఆధ్యాయం చివరి పుటలు కొన్ని చూడండి.