పుట:Oka-Yogi-Atmakatha.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితిం

7

కోరికలకు కారణాలు చూపిస్తూ ఒకటిరెండు చక్కటి వాదాలతో కనక నేను సమర్థించుకోగలిగినట్లయితే, నేను కోరిందల్లా నెరవేర్చేవారు- సెలవుల్లో ప్రయాణాలకయినా సరే, కొత్త మోటారు సైకిలు కావాలన్నా సరే.

ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరసకు చెప్పాలంటే, ఆయనెన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ, గీతాపారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలనన్నిటినీ విడిచిపెట్టేసి, ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకొంటూ, ఇంక పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తరవాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కాని, ఆయన మాత్రం రోజు ఆఫీసుకు ట్రామ్ బండిలోనే వెళ్తూండేవారు.

అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్న గారికి లేదు. ఒకసారి ఆయన, కలకత్తా అర్బన్ బ్యాంకును తానే స్థాపించినప్పటికీ, దాంట్లో వాటాలు తీసుకోడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకి ఇష్టం లేదు. తీరిక వేళల్లో, ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు.

నాన్నగారు ఉద్యోగం విరమించుకున్న తరవాత చాలా ఏళ్ళకి, బెంగాల్ - నాగపూర్ రైల్వేవాళ్ళ పుస్తకాల్ని తణిఖీ చెయ్యడానికి ఇంగ్లండు నుంచి ఒక ఎకౌంటెంటు వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగింది ఏమిటంటే, రైల్వేవారి దగ్గర్నించి నాన్నగారికి బోనస్సు రావలసి ఉంది. బకాయిపడ్డ బోనస్సుకోసం ఆయ నెన్నడూ దరఖాస్తు చెయ్యనేలేదట!

“ముగ్గురి పని ఆయనొక్కడు చేశాడు!” అని కంపెనీకి చెప్పాడు