పుట:Oka-Yogi-Atmakatha.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

ఒక యోగి ఆత్మకథ

ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవలసిన ఏర్పాట్లలో మునిగిపోయాను. ఒక గొంగడిలో కొన్ని వస్తువులు మూట గడుతూ ఉండగా, కొన్నేళ్ళ కిందట నా అటకమీది కిటికీలోంచి బయటికి జారవిడిచిన, అదే మాదిరి మూట నాకు గుర్తుకు వచ్చింది. హిమాలయాలకు వెళ్దామని నేను చేసిన పలాయనం, గ్రహస్థితి బాగాలేక విఫలమయినట్టుగా ఈసారి కూడా విఫలం కాదుకదా అనిపించింది. మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్ళు తొక్కింది; కాని ఈ రోజు రాత్రి, మా గురుదేవుల్ని విడిచి వెళ్తున్న సంగతి తలుచుకుంటే నా మనస్సు పీకుతోంది.

మర్నాడు పొద్దున, స్కాటిష్ చర్చి కాలేజిలో మా సంస్కృతం ప్రొఫెసర్ గారు బిహారి పండిత్‌గారిని పట్టుకున్నాను.

“ఏమండీ, లాహిరీ మహాశయుల శిష్యుల్లో ఒక గొప్పాయనతో మీకు స్నేహం ఉందని చెప్పారు. దయఉంచి నాకు ఆయన ఎడ్రసు ఇయ్యండి,” అని అడిగాను.

“రామగోపాల్ మజుందార్ సంగతే కదూ నువ్వంటున్నది! ఆయన్ని నేను ‘నిద్రపోని సాధువు’ అంటుంటాను. ఆయనెప్పుడూ పరమానందానుభూతిలో మెలుకువగానే ఉంటారు. ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రణబాజ్ పూర్ లో ఉంది.”

ఆ పండితులకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే తారకేశ్వర్‌కు బయలుదేరి రైలెక్కాను. హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయడానికి ‘నిద్రపోని సాధువు’గారి దగ్గర అనుమతి తీసుకుని నా శంకలను నివృత్తి చేసుకోవాలనుకున్నాను. రామగోపాల్ మజుందార్ గారు బెంగాలులో మారుమూల గుహల్లో అనేక సంవత్సరాలపాటు క్రియాయోగ సాధన చేసిన తరవాత ఆత్మ సాక్షాత్కారం కలిగిందని బిహారి పండితులు చెప్పారు.