పుట:Oka-Yogi-Atmakatha.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 13

నిద్రపోని సాధువు

“హిమాలయాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించండి. ఎడతెగని ఏకాంతంలో సంతత దైవానుసంధానం సాధించాలని ఆశిస్తున్నాను.”

ఒకసారి మా గురుదేవులతో నేను కృతఘ్నతాపూర్వకమైన ఈ మాటలు నిజంగానే అన్నాను. అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అనూహ్యమైన భ్రాంతి ఒకటి నన్ను లోబరుచుకున్న మీదట, ఆశ్రమ విధులన్నా కాలేజీ చదువులన్నా నాలో ఓరిమి తగ్గుతూ వచ్చింది. నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీయుక్తేశ్వర్‌గారితో పరిచయమై ఆరునెలలే కావడం, నా తప్పుకు ఒక్క రవ్వ పరిహారం అయిఉండవచ్చు. అప్పటికింకా నేను ఆయన మహోన్నత మూర్తిమత్వాన్ని పరిశీలించనే లేదు.

“హిమాలయాలో చాలామంది కొండవాళ్ళుంటారు; అయినా వాళ్ళకి దైవదర్శనానుభవం ఉండదు.” మా గురుదేవుల సమాధానం మెల్లగా, సరళంగా వినవచ్చింది. “నిశ్చేతనమైన కొండకన్న దైవసిద్ధి పొందిన మనిషిదగ్గర జ్ఞానం ఆర్జించడం ఉత్తమం.”

నా గురువు తామే కాని కొండ కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ కూడా నేను మళ్ళీమళ్ళీ నా కోరిక వెల్లడించాను. గురుదేవులు నాకు సమాధానం అనుగ్రహించలేదు. ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాను. అది ప్రమాదకరమైనదే కాని, దానికి నాకు అనుకూలమైన అర్థం చెప్పుకున్నాను.