పుట:Oka-Yogi-Atmakatha.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

5

కాని ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయవ్యయాల అంచనాకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. ఒకసారి, బీదవాళ్ళకి అన్నదానం చెయ్యడానికి అమ్మ చేసిన ఖర్చు, నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది.

అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు: “నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే. దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు!″ నాన్నగారు సౌమ్యంగా మందలించడం కూడా అమ్మ మనస్సును బాధించేది. తమ కిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకి చూచాయగా కూడా చెప్పకుండా ఆవిడ, ఒక జట్కా బండిని పిలిపించింది.

‘‘సెలవు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా." బహు ప్రాచీనకాలం నుంచి వినిపించే తుది హెచ్చరికే ఇది!

ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం. సరిగ్గా ఆ సమయానికి, ఎక్కణ్ణించో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య; వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు; యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది. దాని మీదట నాన్నగారు, రాజీధోరణిలో నాలుగు మాటలు చెప్పిన తరవాత, బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ. నేను గమనించినంత వరకు, అమ్మకి నాన్నగారికీ ఏర్పడిన ఒకేఒక వివాదం అంతటితో ముగిసింది. అయితే వాళ్ళిద్దరికీ స్వభావసహజంగా సాగిన చర్చమాత్రం ఒకటి గుర్తుకు వస్తుంది.

“ఒక్క పదిరూపాయ లివ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది," అంది. ఎదటివాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది.