పుట:Oka-Yogi-Atmakatha.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

237

కాని గురుదేవులు, తనను తిట్టేవాణ్ణి కాయడానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు. “ఏమీ లేనిదానికి అలా ఆవేశపడకండి. ఇతను తన న్యాయమైన విధి నిర్వర్తిస్తున్నాడు.”

ఆ ఉద్యోగి తనకు ఎదురైన విభిన్న ఆదరాలకు చకితుడై , గౌరవ పురస్సరంగా క్షమాపణ చెప్పుకొని అక్కణ్ణించి ఉడాయించాడు.

అంత ఉగ్రమైన సంకల్ప శక్తిగల గురువులు, లోపల ఎంత శాంతవంతులో గ్రహించినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ‘వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి’- అంటే. “దయ చూపించే సందర్భంలో పువ్వుకన్న మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో పిడుగు కన్న కఠినం” అన్న ఆర్యోక్తి ఆయనకు బాగా నప్పింది.

బ్రౌనింగ్ కవి చెప్పినట్టుగా, “తాము చీకట్లో ఉన్నందువల్ల వెల్తురును ఓపలేనివాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు బయటివాడొకడు, తాను ఊహించుకొన్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీయుక్తేశ్వర్‌గారిని నిందించేవాడు. మనస్సు చెదరని మా గురుదేవులు, అతని ఆరోపణలో సత్యలేశమేదైనా ఉందేమో చూడడానికి ఆత్మవిమర్శ చేసుకొంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవారు. ఇటువంటి సంఘటనలు, గురుదేవుల అద్వితీయమైన సూక్తులు ఒకదాన్ని నాకు గుర్తుకు తెస్తాయి : “కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు!”

సాధువులో వ్యక్తమయే అమోఘమైన ప్రశాంతత, ఏ ఉపదేశమూ కలిగించలేని ప్రభావం కలిగిస్తుంది. “కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడికన్నా బలిష్ఠుడు; తన ఆత్మను తాను పాలించుకొనేవాడు. ఒక పట్నాన్ని పట్టుకున్న వాడికన్నా గొప్పవాడు.”[1]

  1. సామెతలు 16 : 32 (బైబిలు).