పుట:Oka-Yogi-Atmakatha.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

235

కొంతసేపు మాటా పలుకూ లేకుండా కొయ్యబారి ఉన్న తరవాత ఆయన కులాసాగా నవ్వాడు.

“స్వర్గలోకపు మేజిస్ట్రేటుకు ఎదురుపడడం ఇదే నాకు మొదలు,” అన్నాడాయన. తరవాత ఆయన, తనలో అంతర్భాగమై పోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ, తనను “పరివీక్షార్థక” (ప్రొబేషనరీ) శిష్యుడిగా స్వీకరించచుని లాంఛన పూర్వకంగా అభ్యర్థించాడు.

లాహిరీ మహాశయులలాగే శ్రీయుక్తేశ్వర్‌గారు కూడా అనేక సందర్భాల్లో, సన్యాసం తీసుకోదలిచిన “అపరిపక్వ” శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు. “దైవ సాక్షాత్కారం పొందినవాడు కాషాయవస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది,” అన్నారు గురుదేవులిద్దరూ. “సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మరిచిపొండి; అవి మీలో మిథ్యాహంకారం కలిగించి హాని చెయ్యవచ్చు. మీరు నిబ్బరంగా ప్రతిరోజూ సాధించే ఆధ్యాత్మిక ప్రగతికన్న ముఖ్యమైంది మరొకటి లేదు; అందుకు క్రియా యోగాన్ని ఉపయోగించండి.”

మనిషి విలువను గణించడానికి సాధువు ఒక నిశ్చితమైన ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు; ఒకచోటికీ మరొకచోటికీ మారుతుండే ప్రపంచపు కొలబద్దలకు అది భిన్నమైనది. మానవులు, వాళ్ళ దృష్టిలో వాళ్ళకే చిత్రచిత్రమైన వన్నెల్లో గోచరిస్తారు; వాళ్ళని గురువు రెండే రెండు తరగతులుగా విభజిస్తాడు: దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులూ, అన్వేషించే జ్ఞానులూ అని.

మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాల్ని స్వయంగానే చూసుకునేవారు. అన్యాయానికి వెనకాడని వ్యక్తులు కొందరు, ఆయనకు పెద్దలనుంచి సంక్రమించిన భూమిని స్వాధీనంచేసుకోడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. దృఢ