పుట:Oka-Yogi-Atmakatha.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

ఒక యోగి ఆత్మకథ

స్థానికంగా ఉండే మేజిస్ట్రేటుగారు ఒకరు, పూరీలో సముద్రతీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు. పరమ కర్కోటకుడని పేరు పొందిన ఆయనగారు, తలుచుకుంటే మా ఆశ్రమాన్ని మాకు కాకుండా చెయ్యగల అధికారం ఉన్నవాడు. ఈ యథార్థాన్ని నేను మా గురుదేవులకు చెప్పాను. కాని ఆయన నిశ్చలంగా కూర్చున్నారు; వచ్చినాయన్ని పలకరించడానికి లేవనైనా లేవలేదు.

నేను కొద్దిగా గాభరాపడుతూ తలుపుదగ్గర కూర్చున్నాను. శ్రీయుక్తేశ్వర్‌గారు, మేజిస్ట్రేటుగారికోసం కుర్చీ తెమ్మని కూడా నాకు చెప్పలేదు; ఆయనగారు కూర్చోడానికి ఒక కొయ్యపెట్టెతోనే సరిపెట్టు కోవలసి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశకూడా సఫలం కాలేదు.

తరవాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది. ఆ అతిథి అడుగడుగునా, పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాడు. ఆయన చెప్పేవాటిలో, తప్పులు పెరిగేకొద్దీ కోపం కూడా పెరుగుతూ వచ్చింది.

“నేను ఎం. ఏ. పరీక్షలో మొదటిస్థానం సంపాదించానని తెలుసా మీకు?” అని అడిగాడు. హేతుబుద్ధి ఆయన్ని విడిచిపెట్టింది; అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు.

“మేజిస్ట్రేటుగారూ, ఇది మీ కోర్టుగది కాదన్న సంగతి మరిచిపోతున్నారు,” అని జవాబిచ్చారు గురుదేవులు శాంతంగా. “మీ కుర్రతనపు మాటల్నిబట్టి, మీ కాలేజి చదువు చెప్పుకోదగ్గదేమీ కాదని అనిపిస్తుంది. ఏమయినప్పటికీ యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికీ ఏమీ సంబంధం లేదు. సాధువుల్ని ఎకౌంటెట్ల మాదిరిగా ప్రతి సెమిస్టర్ లోనూ జట్లు జట్లుగా తయారుచెయ్యడం జరగదు.”