పుట:Oka-Yogi-Atmakatha.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

231

“ఓడిపోయాను!” చిన్నబోయిన ఆయన ముఖం నవ్వు పుట్టించేలా ఉంది. “నాకు ఆంతరికానుభవం ఏమీ లేదు.” ఆధ్యాత్మిక అపస్మారానికి (Coma) బదులు వివేచనాయుతంగా పెట్టే కామా (Comma); (పుస్తక పరిజ్ఞానం) పరిహారంగా పనికిరాదన్న సంగతి, బహుశా ఆయన, మొట్టమొదటిసారిగా గ్రహించారు.

శిక్షితుడయిన ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తరవాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు: “అనుభవశూన్యులైన ఈ పండితమ్మన్యులు దీపందగ్గర చదివి చదివి చమురు కంపుకొడుతుంటారు. వేదాంతమంటే కేవలం బుద్ధివికాసంకోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిదనుకుంటారు. వాళ్ళు తమ ఉదాత్తభావనలను, బాహ్యచర్య తాలూకు మొరటుతనానికి కాని, మందలిస్తూ ఉండే ఏ ఆంతరిక శిక్షణకుకాని సంబంధంలేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకొంటారు!”

కేవల పుస్తక పరిజ్ఞానానికున్న నిష్పలతగురించి గురుదేవులు ఇతర సందర్భాల్లో నొక్కి వక్కాణించేవారు.

“పెద్ద పెద్ద మాటలతో అవగాహనను తికమక చెయ్యకండి,” అని వ్యాఖ్యానించారాయన. “ఒక్కొక్క శ్లోకమే మెల్లగా ఒంటబట్టించుకుంటూ చదివేటట్లయితే, ఆంతరిక అనుభవ సాధనపట్ల కోరిక రగుల్కొల్పడానికి పవిత్ర గ్రంథాలు బాగా సాయపడతాయి. లేకపోతే, కేవలం మెదడుకు పనిచెప్పేటట్లు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం, కృత్రిమ సంతృప్తి, ఒంటబట్టని తెలివి ఏర్పడవచ్చు.”

శ్రీయుక్తేశ్వర్‌గారు, పవిత్రగ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు. ఇది జరిగింది, తూర్పు బెంగాలులో అడవిలో ఒక ఆశ్రమంలో; అక్కడ ఆయన, దబ్రూ వల్లబ్ అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణ విధానాన్ని