పుట:Oka-Yogi-Atmakatha.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

ఒక యోగి ఆత్మకథ

ఒకమాటు ప్రఖ్యాత రసాయనశాస్త్రవేత్త ఒకరు శ్రీయుక్తేశ్వర్ గారితో హోరాహోరీగా తర్కవితర్కాలు చేశారు. దేవుణ్ణి పసిగట్టడానికి విజ్ఞానశాస్త్రం ఏ సాధనాన్నీ తయారుచెయ్యలేదు కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్పారు.

“అంటే, పరమాత్మను మీ శోధననాళికల్లో పట్టి పరీక్షించడంలో, కారణం చెప్పలేనంతగా విఫలమయ్యారన్నమాట!” గురుదేవుల చూపు తీవ్రంగా ఉంది. “నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను; ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని ఇరవైనాలుగు గంటలపాటు పరీక్షించండి. ఆ తరవాత దేవుడు లేకపోవడం గురించి మీరు ఆశ్చర్యపోరు.”

ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగిందిది. ఆయన మహాభారతంలోంచి, ఉపనిషత్తులలోంచి, శంకరాచార్యులవారి భాష్యాల లోంచి అనేక భాగాలు వినిపిస్తూంటే ఇంటివాసాలు కూడా మారుమోగాయి.

“మీ మాటలు వినడానికి ఎదురుచూస్తున్నాను.” అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్టుగా ఉంది, శ్రీయుక్తేశ్వర్‌గారి కంఠస్వరంలో వెల్లడి అయిన జిజ్ఞాస. ఆ విద్వాంసుడు తికమకపడ్డాడు.

“ఇతరులు చెప్పినవి కోకొల్లలుగా ఉన్నాయి.” ఆ వచ్చినాయనకు కాస్త దూరంలో, మామూలుగా నేను కూర్చునే మూలనే కూర్చున్నాను; గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకరలు తిరిగిపోయాను. “కాని ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతనుబట్టి మీరు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి? మీరు ఏ పవిత్రగ్రంథాన్ని ఒంటబట్టించుకొని మీ సొంతం చేసుకున్నారు? ఈ చిరంతన సత్యాలు మీ స్వభావాన్ని ఏయే రకాలుగా పునరుద్ధరించాయి? ఇతరుల మాటల్నే యాంత్రికంగా మారుపలుకుతూ గ్రామఫోన్‌లా ఉంటే చాలనుకుంటున్నారా?”