పుట:Oka-Yogi-Atmakatha.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

229

అనేక విషయాలగురించి కులాసాగా చర్చలు జరిపేవారు. మా గురుదేవుల సద్యఃస్ఫూర్తి, నోరారా నవ్వేనవ్వు ప్రతి చర్చకు జీవం పోసేవి. తరచు గంభీరంగా ఉన్నప్పటికీ, గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కారు. బైబిలు[1]నుంచి ఉదాహరిస్తూ ఆయన, “ఈశ్వరాన్వేషణ చెయ్యడానికి మనుషులు తమ ముఖాల్ని వికృతం చేసుకోనక్కరలేదు.” అన్నారాయన. “దైవ సాక్షాత్కారం పొందడమంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించడమే నన్న సంగతి గుర్తుంచుకోండి.”

ఆశ్రమానికి వచ్చిన తాత్త్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విజ్ఞానశాస్త్రవేత్తల్లో కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు, తామొక చాదస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామనే భావించేవారు. అప్పుడప్పుడు, అహంకారంతో కూడిన ఒక చిరునవ్వువల్లకాని, తెచ్చి పెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపువల్లకాని, ఆ కొత్తగా వచ్చినవాళ్ళు ఆయన దగ్గిర ఆశించినదల్లా రుచీపచీలేని నాలుగు ఉపదేశవాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడి అయేది. కాని శ్రీ యుక్తేశ్వర్‌గారితో మాట్లాడిన తరవాత, తాము కృషిచేసిన తమతమ ప్రత్యేకరంగాల్లో ఆయనకు సునిశితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టిన ఆ ఆగంతకులకు, అక్కణ్ణించి వెళ్ళాలంటే మనసు ఒప్పేది కాదు.

మామూలుగా మా గురుదేవులు, అతిథులతో సౌమ్యంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరించేవారు; ఆయన ఇచ్చే స్వాగతం సౌహార్దంతో ముగ్ధుల్ని చేసేది. కాని దురహంకారమనే మొండి జబ్బుగలవాళ్ళకు మాత్రం బలవర్ధకమైన అఘాతాలు తగులుతూ ఉండేవి. వాళ్ళకు గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత; అయితే మంచు, లేకపోతే ఇనుము!

  1. మత్తయి 6 : 16 (బైబిలు).