పుట:Oka-Yogi-Atmakatha.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

227

ఉంటుండేవారు. నాకు మొట్టమొదట శ్రీయుక్తేశ్వర్‌గారి దర్శనం అయింది కాశీలోనే. ఆవిడ సౌమ్యురాలు, దయామయి అయినప్పటికీ కూడా దృఢమైన నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకొన్న వ్యక్తి. ఒకనాడు నేను, ఆ తల్లి కొడుకూ మాట్లాడుకొంటూ ఉండగా, ఆవిడ ఇంటి బాల్కనీలో నించుని గమనించాను. గురుదేవులు తమకు స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా, యుక్తి యుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆమెకు నచ్చ జెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆవిడ విసురుగా తల తిప్పడాన్నిబట్టి, ఆయన ఆవిడకి నచ్చజెప్పలేకపోయారని స్పష్టమైంది.

“వద్దు, వద్దు నాయనా; ఇక వెళ్ళిపో! నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు! నేను నీ శిష్యురాల్ని కాను!”

శ్రీయుక్తేశ్వర్‌గారు మరింక వాదించకుండా, తిట్లు తిన్న పిల్లవాడిలా వెనక్కి తగ్గారు. ఆవిడ యుక్తి యుక్తంకాని మనస్థ్సితుల్లో ఉన్నప్పుడు కూడా తల్లిమీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ముగ్ధుణ్ణి అయాను. ఆవిడ దృష్టిలో తన కొడుకు, చిన్నపిల్లవాడేకాని ఋషి కాడు. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది; లోపల వినయంగాను, బయట వంచరాని విధంగాను ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్కనుంచి వెలుగు ప్రసరింపజేసింది.

సన్యాసం తీసుకొన్న వ్యక్తి విధ్యుక్తంగా లౌకికబంధాలనుంచి విడివడ్డ తరవాత వాటిని నిలుపుకోడానికి సన్యాసధర్మనియమాలు అనుమతించవు. గృహస్థుకు విధ్యుక్తమైన పూజాపురస్కారాలవంటి కర్మకాండ నిర్వర్తించగూడదు. అయినప్పటికీ, సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వ్యవస్త్రీకరించిన శంకరులు, ఈ నియమాన్ని పట్టించుకోలేదు. ప్రేమాస్పదురాలైన తమ తల్లి గారు కాలంచేసినప్పుడు ఆయన, పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్ని పుట్టేటట్టుచేసి దాంతో ఆవిడ దేహాన్ని దహనంచేశారు.