పుట:Oka-Yogi-Atmakatha.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

ఒక యోగి ఆత్మకథ

“ఆబకు కాకుండా, ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే! తృప్తిపరచజాలని కోరికల్ని రేపడానికి కాకుండా, కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి, కామప్రవృత్తిని నెలకొల్పింది,” అన్నారాయన. “చెడ్డకోరికల్ని ఇప్పుడు నాశనం చెయ్యి, లేకపోతే అవి, నీ సూక్ష్మ శరీరం భౌతికకోశం నుంచి విడివడ్డ తరవాత కూడా నీతోనే ఉంటాయి. శరీరం, వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనక, క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్పబలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛనూ జయించవచ్చు.

“మీ శక్తుల్ని పదిలపరుచుకోండి. ఇంద్రియాలనే ఉపనమలన్నింటినీ తనలో కలుపుకొనే విశాలమైన మహాసముద్రంలా ఉండండి. రోజురోజూ తలఎత్తే ఇంద్రియవాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి; అవి జలాశయానికున్న బెజ్జాలలాంటివి; దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికవాదమనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేట్టు చేస్తాయవి. చెడ్డకోరిక అనే శక్తిమంతమైన ప్రచోదక ఆవేగం మానవుడి సుఖానికి మహాశత్రువు. ఆత్మనిగ్రహ సింహంలా ప్రపంచంలో తిరగండి; ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు, చుట్టూ చేరి మిమ్మల్ని తన్నకుండా చూసుకోండి!”

నిజమైన భక్తుడు సహజాత నిర్బంధాలన్నిటి నుంచి చివరికి విముక్తి పొందుతాడు. మానవ ప్రేమకోసం తనకుగల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా -- అది సర్వవ్యాప్తమయినందువల్ల ఏకమాత్ర ప్రేమగా- పరివర్తన చేస్తాడు.

శ్రీ యుక్తేశ్వర్‌గారి తల్లిగారు కాశీలో రాణామహల్ బస్తీలో