పుట:Oka-Yogi-Atmakatha.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

225

“స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే, స్త్రీ పురుషు లుభయులుగానూ రూపధారణ చేసే ఆత్మ, మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార, నిర్గుణ ప్రతిరూపం.

శ్రీయుక్తేశ్వర్‌గారు స్త్రీలను ఎన్నడూ పరిహరించనూ లేదు, వాళ్ళను “పురుషుడి పతనానికి” కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రాచీనకాలపు మహాభక్తుడు, ఒకాయన స్త్రీలను “నరకానికి ద్వారం”గా చెప్పడానికి కారణమేమిటని నేనొకసారి గురుదేవుల్ని అడిగాను.

“చిన్నప్పుడు ఒకమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండి ఉండాలి,” అని జవాబిచ్చారు మా గురుదేవులు, ఘాటుగా. “లేకపోతే ఆయన, స్త్రీని కాకుండా, తనలోని ఆత్మ నిగ్రహంలోని లోపాలన్ని గర్హించి ఉండేవాడు.”

చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరయినా మనోవికార ద్యోతకమైన కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు. “అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడాలాంటిది; దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి,” అని శిష్యులకు చెప్పారాయన. “ఇంద్రియాలకు బానిసలయిన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొర్లాడుతున్నప్పుడు, ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్ళకు సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి,”

మాయాప్రేరితమైన కామలాలసనుంచి బయటపడడానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీయుక్తేశ్వర్‌గారు వాళ్ళని సరిగా అర్థం చేసుకొని తగిన సలహా ఇచ్చేవారు.