పుట:Oka-Yogi-Atmakatha.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

199

మీద అలాగే పడిఉన్నాయి; వాటిలో ఒక్కటీ నాకు సాయపడలేదు. అస్వస్థమైన శరీరంతో బతికి లాభమేమిటని, విచారగ్రస్తుణ్ణయి నాలో నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను.

“మందులకు పరిమితులున్నాయి; దివ్యమైన సృజనాత్మక శక్తికి అటువంటిది ఏదీ లేదు. ఇది నమ్ము. నువ్వు ఆరోగ్యంగా, బలంగా తయారవుతావు.”

గురుదేవుల మాటల మీద నాకు తక్షణమే విశ్వాసం కలిగింది; వాటిలోని సత్యాన్ని నా జీవితానికి వర్తింపజేసి విజయం సాధించగలనన్న నమ్మకం నాకు కలిగించాయి. (జబ్బులు నయంచేసే వాళ్ళలో చాలామంది దగ్గరికి నేను వెళ్ళాను కాని) మరొకరెవరూ నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలేదు.

రోజురోజుకూ నాకు బాగా ఒళ్ళు వచ్చింది; ఆరోగ్యం, బలం పెరిగాయి. శ్రీ యుక్తేశ్వర్‌గారి గుప్తమైన ఆశీస్సు ద్వారా, ఒక్క రెండు వారాల్లో, అంతకుముందు నే నెంత ప్రయత్నించినప్పటికీ సాధించలేనంత బరువు పెరిగింది. నా ఉదరవ్యాధులు శాశ్వతంగా మటుమాయ మయాయి.

ఆ తరవాత మరికొన్ని సందర్భాల్లో మా గురుదేవులు, మధుమేహం, మూర్ఛ, క్షయ, పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్ళకు దివ్య శక్తితో నయం చెయ్యడం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది.

“చాలా ఏళ్ళ కిందట నేను కూడా బరువు పెరగాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాణ్ణి.” నన్ను నయంచేసిన కొన్నాళ్ళకి గురువుగారు నాకు చెప్పారు : “ఒకసారి తీవ్రంగా జబ్బుచేసి కోలుకుంటున్న సమయంలో, కాశీలో లాహిరీ మహాశయుల్ని దర్శించాను.”