పుట:Oka-Yogi-Atmakatha.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

ఒక యోగి ఆత్మకథ

అది మా వేపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది. గురువుగారు దాన్ని చూసి, ఒక పసిపిల్ల వాణ్ణి చేరబిలుస్తున్నట్టుగా నవ్వారు. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతూండడం చూసి నేను గాభరా పడిపోయాను.[1] భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు! నేను మనస్సులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. గురువుగారికి చాలా చేరువగా వచ్చిన తరవాత ఆ పాము నిశ్చలంగా నిలిచిపోయింది; ఆయన లాలింపు వైఖరికి ఆకృష్టమయినట్టుంది. భీతావహంగా ఉన్న పడగ క్రమంగా ముడుచుకుపోయింది. అది శ్రీ యుక్తేశ్వర్‌గారి కాళ్ళ సందులోకి దూరి, అక్కణ్ణించి పొదల్లోకి పోయి అదృశ్యమయింది.

“గురువుగారు చేతులెందుకు ఆడించారో, పాము కాటెందుకు వెయ్య లేదో అప్పట్లో నాకు అర్థం కాలేదు.” అంటూ ముగించాడు ప్రపుల్లుడు.

“మన గురుదేవులు, ఏ ప్రాణివల్ల కలిగే ప్రమాద భయానికయినా సరే అతీతులని అప్పుడు గ్రహించాను.”

నేను ఆశ్రమంలో ఉన్న తొలి నెలల్లో ఒకనాటి మధ్యాహ్నం, శ్రీ యుక్తేశ్వర్‌గారి కళ్ళు నా మీద నిల్చి, గుచ్చిగుచ్చి చూస్తూండడం గమనించాను.

“నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుందా.”

ఆయన చేసిన వ్యాఖ్య నా మనస్సుకు గుచ్చుకుంది; గుంటలు పడ్డ నా కళ్ళు, ఆర్చుకుపోతున్న శరీరమూ నాకు నచ్చవు. కాని అవి చాలా కాలంగా పీడిస్తున్న అజీర్ణవ్యాధివల్ల చిన్నప్పటినించి వెంటాడుతున్నాయి. ఎన్నో టానిక్కుల సీసాలు మా ఇంట్లో నా గదిలో షెల్ఫు

  1. తాచుపాము తన పరిధిలో కదులుతున్నదాన్ని, దేన్నయినా టక్కున కొట్టగలదు. చాలా సందర్భాల్లో, పూర్తిగా కదలకుండా ఉండడం, ఒక్కటే క్షేమకరం.