పుట:Oka-Yogi-Atmakatha.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

ఒక యోగి ఆత్మకథ

మైన ఈ వాతావరణంలోకి ప్రవేశించి నా దృష్టి మళ్ళించడానికి పాల్పడింది. విషపూరితమైన సూదిలాంటి తన తొండాన్ని కసుక్కున నా తొడలోకి గుచ్చేసరికి, దానిమీద కసి తీర్చుకోడానికి నేను చటుక్కున చెయ్యి ఎత్తాను. కాని దానికి మరణదండన విధించకుండా ఆపేశాను. సరిగా ఆ సమయానికి నాకు, అహింసనుగురించి పతంజలి చెప్పిన సూత్రం గుర్తుకు వచ్చింది.[1]

“పని పూర్తి చెయ్యలేదేం?”

“గురుదేవా! జీవహింసను సమర్థిస్తారా?”

“లేదు. కాని ఇప్పటికే నువ్వు, నీ మనస్సులో చావుదెబ్బ కొట్టావు.”

“నాకు అర్థం కాలేదు.”

“అహింస అని చెప్పడంలో పతంజలి ఉద్దేశం, చంపాలన్న ‘కోరిక’ను తొలగించడం.” నా మనస్సులోని ఆలోచనల్ని, తెరిచిపెట్టిన పుస్తకం చదివినట్టే గ్రహించేవారు శ్రీ యుక్తేశ్వర్‌గారు. “అహింసను అక్షరాలా పాటించడానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటయింది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చెయ్యక తప్పని స్థితి వస్తే రావచ్చు. కాని అదే మాదిరిగా, కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మట్టుకు రాదు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నిటికీ ఉంది. సృష్టిరహస్యాన్ని బహిర్గతంచేసే యోగి, ప్రకృతిలో ఉన్న, దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాకమైన అభివ్యక్తులతో సామరస్యం ఏర్పరచుకొని ఉంటాడు. హింసాభిలాషను కనక జయించి నట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు.”

  1. “అహింసలో పరిపూర్ణత సాధించినవాడి సమక్షంలో [ఏ జీవిలోనూ] శత్రుభావం కలగదు.” (‘అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః’) - యోగసూత్రాలు, II : 35.