పుట:Oka-Yogi-Atmakatha.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

187

“నా జ్ఞాపకాల్లో మరొకటి ఏమిటంటే – మా పక్కింటివాళ్ళ గజ్జి కుక్క నాకు కావాలన్న కోరిక. ఆ కుక్క కోసం కొన్ని వారాలపాటు ఇంట్లో గందరగోళం చేసిపారేశాను. అంతకన్న కంటికి ఇంపుగా ఉండే కుక్కల్ని ఇస్తామన్నా నేమ వినిపించుకోలేదు. ఇందులో నీతి: మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ అది, ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది.

“మూడో కథ, కుర్రవాడి మనస్సు, మలచడానికి ఎలా వీలుగా ఉంటుందో తెలిపేది. మాటవరసకు, మా అమ్మ చేసిన వ్యాఖ్య ఒకటి విన్నాను: ‘ఒకడి కింద నౌకరీకి కుదిరినవాడు బానిస’ అని. ఆ సంగతి నా మనస్సులో ఎంత గాఢంగా నాటుకుందంటే, నాకు పెళ్ళయిన తరవాత కూడా ఉద్యోగాలన్నిటినీ నిరాకరించాను. కుటుంబానికి ఉన్న డబ్బు, భూమి మీద పెట్టుబడి పెట్టి ఖర్చులు గడుపుకొనేవాణ్ణి. ఇందులో నీతి: సూక్ష్మగ్రహణశక్తిగల, పిల్లలకు మంచివీ అనుకూలమైనవీ అయిన సూచనలు చెవులకు ఎక్కేటట్టు చెయ్యాలి. వాళ్ళకు చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలాకాలం ఉంటాయి.”

గురుదేవులు ప్రశాంత మౌనంలో నిమగ్నులయారు. దాదాపు నడిరాత్రివేళ నన్నొక సన్నటి మంచం దగ్గరికి తీసుకువెళ్ళారు. గురుదేవులు, ఆశ్రమంలో ఆ మొట్టమొదటి రాత్రి నాకు గాఢంగా, మధురంగా నిద్ర పట్టింది.

మర్నాడు పొద్దునే నాకు క్రియాయోగ దీక్ష ప్రసాదించడానికి శ్రీయుక్తేశ్వర్‌గారు నిశ్చయించారు. అంతకు పూర్వమే నేను, లాహిరీ మహాశయుల శిష్యులిద్దరి దగ్గర క్రియాయోగ దీక్ష పొందాను; వారిలో ఒకరు మా నాన్నగారు, రెండో వారు నాకు సంస్కృతం నేర్పిన స్వామి కేవలానందగారు. అయితే గురుదేవులకు పరివర్తక శక్తి ఉంది; వారి