పుట:Oka-Yogi-Atmakatha.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

ఒక యోగి ఆత్మకథ

పూర్‌లో పుట్టాను.[1] నాన్నగారు సిరిసంపదలున్న వ్యాపారి. ఇప్పుడు నా ఆశ్రమంగా ఉన్న, తాతలనాటి ఈ భవనాన్ని ఆయన నా కిచ్చారు. యథావిధిగా నేను బడికి వెళ్ళింది తక్కువ. నా కది మందగొడిగాను, లోతులేనట్టుగాను అనిపించేది. యౌవనంలో అడుగు పెట్టిన తొలినాళ్ళలోనే నేను సంసార బాధ్యతలు పైన వేసుకున్నాను. నాకో కూతురుంది; పెళ్ళయింది. మధ్యజీవితంలో నాకు లాహిరీ మహాశయుల మార్గదర్శిత్వ భాగ్యం కలిగింది. నా భార్య చనిపోయిన తరవాత సన్యాసం తీసుకున్నాను. శ్రీయుక్తేశ్వర్‌గిరి[2] అనే కొత్త పేరు వచ్చింది. ఇంతింత మాత్రమే నా జీవిత వృత్తాంతాలు.”

ఆత్రంతో చూస్తున్న నా ముఖంలోకి చూసి నవ్వారు గురువుగారు. జీవిత కథాసంగ్రహాలన్నిటి లాగే, ఆయన మాటలు నాకు, బాహ్య యథార్థాల్ని తెలిపాయి కాని, లోపలి మనిషిని బయలుపరచలేదు.

“గురూజీ, మీ చిన్నప్పటి కథలు కొన్ని వినాలని ఉంది.”

“కొన్ని చెబుతాను – ప్రతిదానికి ఒక నీతి ఉంది!” శ్రీ యుక్తేశ్వర్‌గారి కళ్ళు హెచ్చరికతో మిలమిల్లాడాయి. “మా అమ్మ ఒకసారి నన్ను బెదిరించడానికి, ఒక చీకటి గదిలో దెయ్యముందని భయపెట్టింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూసి, దెయ్యం కనిపించలేదని నిరాశగా చెప్పాను. మరెన్నడూ అమ్మ నాకు దెయ్యాల కథ చెప్పి భయపెట్ట లేదు. ఇందులో నీతి: నీ భయానికి కారణమైనదానికి ఎదుటపడి చూడు; అది నిన్నింక ఇబ్బంది పెట్టదు.”

  1. శ్రీ యుక్తేశ్వర్‌గారు 1855 మే 10 తారీఖున పుట్టారు.
  2. ‘యుక్తేశ్వర్’ అంటే, “ఈశ్వరుడితో ఐక్యమైనవాడు” అని అర్థం. ‘గిరి’ అన్నది, సనాతనమైన పది సన్యాసాశ్రమ శాఖల్లో ఒకదాని పేరు; ‘శ్రీ’ అంటే పవిత్రమైన; ఇది పేరుకాదు కాని గౌరవవాచకం.