పుట:Oka-Yogi-Atmakatha.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 12

గురుదేవుల ఆశ్రమంలో

గడిచిన కాలం

“వచ్చేశావు.” బాల్కనీ ఉన్న గదిలో నేలమీద పులిచర్మం మీద కూర్చున్న శ్రీయుక్తేశ్వర్‌గారు నన్ను పలకరించారు. ఆయన కంఠస్వరం ముక్తసరిగా ఉంది. ఆయన తీరు భావోద్రేకరహితంగా ఉంది.

“ఔను గురుదేవా, మిమ్మల్ని అనుసరించడానికి వచ్చాను.” మోకరిల్లి ఆయన పాదాలు ముట్టుకున్నాను.

“అదెలా సాధ్యం! నా కోరికల్ని నువ్వు ఉపేక్షిస్తావు.”

“ఇకముందు అలా జరగదు గురూజీ! మీ కోరికే నాకు శాసనం!”

“బాగుంది! అలా అయితే నీ జీవితానికి బాధ్యత వహించగలను.”

“మనః పూర్తిగా ఆ భారం మీ మీదే పెడుతున్నాను గురుదేవా!”

“అయితే నా మొదటి కోరికగా, నువ్వు మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు కలకత్తాలో కాలేజీలో చేరి చదువు కొనసాగించాలని నేను కోరుతున్నాను.”

“మంచిది గురుదేవా!” నా గాభరాని మరుగుపరిచాను. ఈ పుస్తకాల బెడద ఏళ్ళ తరబడి నాకు తప్పదా? మొదట్లో నాన్నగారూ ఇప్పుడు శ్రీయుక్తేశ్వర్‌గారూ!