పుట:Oka-Yogi-Atmakatha.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

ఒక యోగి ఆత్మకథ

కాని కథ విడివడుతున్న కొద్దీ మా అన్నయ్య, శాంతపడుతూ వచ్చి తరవాత గాంభీర్యం వహించాడు.

“అవసరాన్ని బట్టి లబ్ధి ఉంటుందనే సూత్రం (డిమాండ్ – సప్లయిసూత్రం) నే ననుకున్న దానికన్న సూక్ష్మమైన స్తరాల్లో కూడా పనిచేస్తుంది.” ఇంతకు ముందెన్నడూ పొడగట్టని ఆధ్యాత్మిక ఉత్సాహంతో అన్నాడు అనంతు అన్నయ్య. “ప్రాపంచికమైన ధనసంపదలన్నా, అసభ్యంగా కూడబెట్టడాలన్నా నీ కుండే ఉపేక్షాభావం మొదటిసారిగా నా కిప్పుడు అర్థమైంది.”

అంత అపరాత్రి వేళ కూడా, అప్పటికప్పుడు తనకి క్రియాయోగ దీక్ష[1] ఇమ్మని మా అన్నయ్య పట్టుబట్టాడు. “గురు” ముకుందుడు, ఒకే రాత్రి, ఇద్దరు అయాచిత “శిష్యు”ల బాధ్యత వహించవలసి వచ్చింది.

మర్నాడు పొద్దున సామరస్య పూర్వకమైన వాతావరణంలో ఫలహారాలు చేశాం; ఇది ముందటి రోజున కరువైంది.

నేను జితేంద్రుడి వేపు చూసి చిన్నగా నవ్వాను. “నువ్వు తాజ్ చూడకుండా వెళ్ళకూడదు. శ్రీరాంపూర్‌కు బయల్దేరేలోగా చూద్దాం.”

అనంతుకు వీడ్కోలు చెప్పి నేనూ నా స్నేహితుడూ ఆగ్రాకు ఘనత చేకూర్చిన తాజ్‌మహల్‌కు వచ్చి ఎదురుగా నించున్నాం. ఎండలో కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి ఆ పాలరాతి కట్టడం, సంపూర్ణ సౌష్ఠవానికి నిదర్శనంగా నిలిచింది. నల్లని తమాల వృక్షాలు, మిలమిల మెరిసే పసరిక నేల, ప్రశాంతమైన నీటి మడుగు, దానికి చక్కని దృశ్యం సమ కూర్చాయి. విలువైన రాళ్ళు పొదిగి లతలు చెక్కి ఉన్న భాగాలు, లోపల

  1. ఆధ్యాత్మిక ఉపదేశం; సంస్కృతంలో ‘దీక్ష్’ అనే ధాతువునుంచి వచ్చింది; తాను అంకితం కావడం అని దీనికి అర్థం.