పుట:Oka-Yogi-Atmakatha.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు బృందావనంలో

179

త్వరితం చేయ్యవచ్చు. నీ సాధనలో నిష్ఠగా ఉండు , గురువులందరికీ గురువయినవాణ్ణి చేరతావు నువ్వు.”

“ఎంతో కాలంగా నేను వెతుకుతున్న యోగప్రక్రియను కనుక్కోడానికే నన్నిక్కడికి పంపించినట్టుంది,” అన్నాడు ప్రతాప్ సాలోచనగా. “ఈ ప్రక్రియ, ఇంద్రియ బంధనాల నుంచి నుంచి విముక్తి కలిగించి, ఉచ్చస్థితులకు తీసుకువెడుతుంది. ఈనాడు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావడం నాకు అన్నిటికన్న గొప్ప మేలయింది.”

మేము కొంతసేపు మౌనంగా అవగాహన చేసుకొంటూ కూర్చున్నాం. ఆ తరవాత స్టేషన్‌లోకి వెళ్ళాం. రైలు ఎక్కుతూ ఉండగా, నా కెంతో ఆనందం కలిగింది. కాని జితేంద్రుడికి ఈ రోజు కన్నీళ్ళ రోజు. ప్రతాప్‌కు నేను ఆప్యాయంగా వీడ్కోలు చెబుతూ ఉండగా నా మిత్రు లిద్దరికీ మధ్య మధ్య ఎక్కెక్కి ఏడుపులు వచ్చాయి. ప్రయాణంలో మళ్ళీ మరోసారి జితేంద్రుడు దుఃఖంలో మునిగాడు. ఈసారి తనకోసం కాదు. తన పరిస్థితి గురించి.

“భగవంతుడి మీద నా విశ్వాసం, గాఢతలేకుండా ఎంత పై పైన ఉంది! నా గుండె బండబారింది! ఇక ముందెప్పుడూ దేవుడి రక్షణను శంకించను!”

అర్ధరాత్రి కావస్తోంది. చేతిలో పైస లేకుండా వెళ్ళిన “సిండ రెల్లాలు” ఇద్దరూ అనంతుడి పడగ్గదిలోకి ప్రవేశించారు. తను తేలికగా ఊహించి ఉన్నందువల్ల, అప్పుడు అతని ముఖంలో కనిపించిన ఆశ్చర్యం చూసి తీరవలసిందే. నేను మాట్లాడకుండా, బల్లమీద రూపాయి కాయితాలు కురిపించాను.

“జితేంద్రా, నిజం చెప్పు.” అనంతుడి గొంతులో వేళాకోళం ఉంది. “ఈ కుర్రవాడు ఎక్కడా దారి దోపిడీకి దిగలేదు కదా?”