పుట:Oka-Yogi-Atmakatha.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

ఒక యోగి ఆత్మకథ

కొంతసేపటి దాకా మా స్నేహితుడు తిరిగి రాలేదు; చివరికి బోలెడు మిఠాయిలు మాకు కానుకగా తెచ్చాడు.

“ఈమాత్రం పుణ్యం చేసుకోడానికి దయతో నన్ను అనుగ్రహించండి.” కొన్ని రూపాయల కట్ట, ఆగ్రాకి అప్పుడే కొన్న రెండు టిక్కెట్లు చూపిస్తూ బతిమాలుతున్నట్టుగా చిరునవ్వు నవ్వాడు ప్రతాప్.

నేను వాటిని తీసుకొన్నది, భగవంతుడి అదృశ్య హస్తం మీదున్న భక్తి ప్రపత్తులతోనే, అనంతుడు ఎంత ఎగతాళి చేసినప్పటికీ, దాని ఔదార్యం, అవసరాన్ని ఎంతో మించిపోలేదా?

స్టేషనుకు దగ్గరిలో ఒక ఏకాంత ప్రదేశం చూసుకున్నాం.

“ప్రతాప్, మీకు క్రియాయోగం నేర్పుతాను; ఆధునిక కాలంలో అందరికన్న మహాయోగి అయిన లాహిరీ మహాశయుల దిది. ఆయన యోగవిద్యే మీకు గురువు.”

ఒక్క అరగంటలో దీక్ష ముగిసింది. “ ‘క్రియ’ నీకు చింతామణి[1],” అన్నాను కొత్త శిష్యుడితో. “పద్ధతి సులువైందని నువ్వు గమనించే ఉంటావు. మనిషి ఆధ్యాత్మిక పరిణామాన్ని త్వరితం చేసే నేర్పు దీనికి ఉంది. దేహధారణ చేసే అహంకారం, మాయ నుంచి విముక్తి పొందడానికి పది లక్షల సంవత్సరాలు పడుతుందని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. క్రియాయోగం ద్వారా, సహజమైన ఈ కాలావధి చాలా వరకు తగ్గిపోతుంది. జగదీశ్‌చంద్ర బోసు మన కళ్ళకు కట్టించినట్టు, మొక్క పెరుగుదలను మామూలు రేటుకు మించి త్వరితం చెయ్యడానికి, వీలున్నట్టు, మనిషి మానసిక వికాసాన్ని కూడా శాస్త్రీయ సాధనల ద్వారా

  1. కోరికలు తీర్చే శక్తిగల పురాణ ప్రసిద్ధమైన మణి, భగవన్నామాలలో ఇదొకటి.