పుట:Oka-Yogi-Atmakatha.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు బృందావనంలో

177

భగవానుడు నాకు దర్శనమిచ్చి సరిగా ఈ చెట్టు కిందే ఇద్దరు పరిత్యక్త వ్యక్తుల ఆకారాల్ని నాకు చూపించాడు. వాటిలో ఒకటి మీది – అంటే, నా గురువులది! నేను ధ్యాన సనుయంలో తరచుగా మీ మూర్తినే చూస్తుండేవాణ్ణి. మీరు, సవినయంగా నే నందిచ్చే సేవల్ని స్వీకరిస్తే ఎంతో ఆనందిస్తాను!”

“మీరు నన్ను కనుక్కున్నందుకు నాక్కూడా సంతోషంగానే ఉంది. దేవుడుగాని, మనుషులుకాని మమ్మల్ని పరిత్యజించలేదు!” నేను, నా ఎదుట ఆత్రంగా చూస్తున్న వ్యక్తి ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉన్నప్పటికీ, మనస్సులోనే భగవంతుడి దివ్య చరణాలకు మొక్కుకున్నాను.

‘‘మిత్రులారా, ఒక్కసారి మీరు మా ఇంటిని పావనం చెయ్యరూ?”

“మీరు దయగలవారే; కాని అలా చెయ్యడానికి కుదరదు. ఇప్పటికే మేము, ఆగ్రాలో మా అన్నయ్యకి అతిథులుగా ఉన్నాం.”

“పోనీ కనీసం, మీతో కలిసి బృందావనంలో తిరిగానన్న జ్ఞాపకాలన్నా నాకు మిగిలేటట్టు అనుగ్రహించండి.”

నేను సంతోషంగా ఒప్పుకొన్నాను. ఆ యువకుడి పేరు ప్రతాప్ ఛటర్జీ అని చెప్పాడు. ఒక గుర్రబ్బండిని పిలిచాడు. మేము మదనమోహన ఆలయమూ తక్కిన కృష్ణాలయాలూ దర్శించాం. మా ఆలయ సేవలు పూర్తి అయేసరికి చీకటి పడింది.

“నేను ‘సందేశ్’ తీసుకొచ్చే దాకా ఆగండి.” ప్రతాప్, రైలు స్టేషను దగ్గర ఒక దుకాణంలోకి వెళ్ళాడు. వెనకటికన్న ఇప్పుడు చల్లగా, జనసమ్మర్దంగా ఉన్న విశాలమైన వీధిలో నేనూ జితేంద్ర పచార్లు చేశాం.