పుట:Oka-Yogi-Atmakatha.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

ఒక యోగి ఆత్మకథ

ఈ వాగ్దానంలో ఒక అసందర్భం ఉంది. అయితే సంప్రదాయ విరుద్ధమైన ఆ సందర్భానికి తగ్గట్టుగానే ఉంది. పెద్దన్న చిన్నవాళ్ళకి తలవంచడమన్నది భారతీయ కుటుంబంలో అరుదు; చిన్నవాళ్ళు తండ్రి తరవాత అంత గౌరవమూ విధేయతా అతనికే చూపిస్తారు. కాని నే నేమీ వ్యాఖ్యానించడానికి వ్యవధి లేదు; మా బండి బయల్దేరబోతోంది.

రైలుబండి మైళ్ళకు మైళ్ళు సాగిపోతూంటే జితేంద్రుడు, దిగులు మొహం పెట్టుకొని మాటా పలుకూ లేకుండా కూర్చుని ఉన్నాడు. చివరికి కదిలాడు. ముందుకు వాలి, సున్నితమైన ఒకచోట, బాగా నొప్పి పుట్టేలా నన్ను గిల్లాడు.

“భగవంతుడు మనకి తరవాతి భోజనం ఏర్పాటుచేస్తాడన్న సూచన ఏదీ నాకు కనిపించడం లేదు!”

“ఓయి అనుమానం మనిషీ, నిబ్బరంగా ఉండు. దేవుడు మనతోటే పనిచేస్తున్నాడు.”

“అదేదో ఆయన త్వరగా చేసేటట్టు ఏర్పాటు చెయ్యగలవా! ముందు పరిస్థితి తలుచుకునే సరికే కరకరా ఆకలి వేస్తోంది. నేను కాశీ విడిచి పెట్టి వచ్చింది తాజ్ సమాధి చూడ్డానికే కాని నేను సమాధి కావడానికి కాదు!”

“ధైర్యం తెచ్చుకో జితేంద్రా! మొట్టమొదటి సారిగా మనం బృందావనంలో దైవసంబంధమైన అద్భుతాలు చూడనక్కర్లేదూ? కృష్ణ భగవానుడి పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశంలో – మనం నడవబోతున్నామన్న ఆలోచనతోనే నేను గాఢమైన ఆనందంలో మునిగి ఉన్నాను.”

మా రైలు పెట్టె తలుపు తెరుచుకుంది. ఇద్దరు మగవాళ్ళు వచ్చి కూర్చున్నారు. దీని తరవాత రైలు ఆగబోయే చోటే చివరిది.