పుట:Oka-Yogi-Atmakatha.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

ఒక యోగి ఆత్మకథ

కూడదు; మీ ఇబ్బంది ఎవ్వరికీ చెప్పకూడదు; తిండి తినకుండా ఉండా కూడదు, బృందావనంలో చిక్కుబడిపోనూ కూడదు. ఈ పరీక్షలో ఏ ఒక్క నియమాన్ని మీరకుండా, మీరు కనక ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోగా ఇక్కడ నా బంగళాకి తిరిగివస్తే, నా కంటె ఆశ్చర్యపోయే వాడు ఆగ్రా మొత్తంలో మరొకడు ఉండడు!”

“నీ సవాలుకు ఒప్పుకుంటున్నాను.” నా మాటల్లోకాని, గుండెలో కాని జంకన్నది ఏ కోశానా లేదు. భగవంతుడు అప్పటికప్పుడు చూపించే కృప తాలూకు జ్ఞాపకాలు కృతజ్ఞతా భరితంగా నా మనస్సులో మెదిలాయి; లాహిరీ మహాశయుల చిత్రానికి చేసుకొన్న విన్నపంతో ప్రాణాంతకమైన కలరా జబ్బు నాకు నయమవడం, లాహోర్‌లో ఇంటి కప్పుమీద రెండు గాలి పడగలు నాకు బహుమతిగా చిక్కడం, బెరైలీలో ఉన్నప్పుడు నేను నిరుత్సాహంగా ఉన్న సమయంలో, సరిగా సమయానికి రక్షరేకు దొరకడం, కాశీలో పండితుడి ఇంటి ఆవరణకు బయట ఒక సాధువుద్వారా నిశ్చయాత్మకమైన సందేశం ఒకటి రావడం, జగన్మాత దివ్యదర్శనం, ఆవిడ ప్రియవాక్కులు, నా హైస్కూలు డిప్లమా సంపాయించడానికి వీలుగా చివరి క్షణంలో నాకు దారి కొరకడం, జీవితమంతా కంటున్న కలల పొగమంచులోంచి నా గురుదేవుల దర్శనభాగ్యమనే పరమోత్కృష్టమైన వరం లభించడం- ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ ప్రపంచపు భీకర సంగ్రామ రంగాల్లో నా “వేదాంతం”, ఏ ఒక్క పోరాటాన్ని ఎదుర్కో జాలదని అన్నా, ఒక్కటికి ఒప్పుకోను!

“నీ ఒప్పుదల మెచ్చుకోదగ్గది. ఇప్పుడే మిమ్మల్ని రైలెక్కించడానికి వస్తాను,” అన్నాడు అనంతుడు.

జితేంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు. అన్నయ్య వాడివేపు తిరిగి ఇలా