పుట:Oka-Yogi-Atmakatha.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

ఒక యోగి ఆత్మకథ

(పాపం, అనంతన్నయ్య జీవితం నిజంగా స్వల్పకాలంలోనే ముగిసిపోయింది).[1]

“ఇదంతా ఆశ్రమంలో ఒంటబట్టిన తెలివి కాబోలు! అయినా, నువ్వు కాశీ విడిచి వచ్చేసినట్టు కనిపిస్తోంది,” అనంతుడి కళ్ళు తృప్తితో మిలమిలా మెరిశాయి. నా రెక్కలు, సంసారమనే గూటిలో భద్రంగా ముడుచుకొని ఉండేలా చెయ్యాలని అతను ఇంకా ఆశపడుతున్నాడు.

“కాశీలో నా మజిలీ వృథా కాలేదు! నా మనస్సు ఆశించినది నా కక్కడ దొరికింది! కాని నీ పండితుడివల్లా, ఆయన కొడుకువల్లా మాత్రం కాదని నిశ్చయంగా తెలుసుకో!”

అనంతుడు వెనకటి సంగతి గుర్తు చేసుకుంటూ నాతోబాటు నవ్వాడు. తాను ఎంపికచేసిన, “దివ్యదృష్టిగల” కాశీ పండితుడు ఒట్టి హ్రస్వదృష్టి గలవాడన్న సంగతి ఎప్పుడో ఒప్పుకోవలసి వచ్చింది.

“మరి నీ ముందాలోచన లేమిటి, తిరుగుడుమారి తమ్ముడూ?”

“జితేంద్ర నన్ను ఆగ్రా రావడానికి ప్రోత్సహించాడు. ఇక్కడున్న తాజమహల్ అందాలు చూద్దాం,” అని చెప్పాను. ఆ తరవాత, కొత్తగా నాకు కనిపించిన గురువుగారి దగ్గరికి వెళ్తాం, ఆయనకి శ్రీరాం పూర్‌లో ఆశ్రమం ఉంది.”

అనంతుడు, మాకు సుఖంగా ఉండేలా ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. అతని కళ్ళు సాలోచనగా నా మీద నిల్చి ఉండడం, సాయంత్రం నాలుగుసార్లు గమనించాను.

“ఆ చూపు నాకు తెలుసు!” అనుకున్నాను. “ఏదో కుట్ర పన్నడం మొదలయింది!”

  1. చూడండి అధ్యాయం : 25.