పుట:Oka-Yogi-Atmakatha.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 11

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు

బృందావనంలో

“నాన్నగారు నీకు వారసత్వం సంక్రమించకుండా చేస్తే సరిపోతుంది ముకుందా! జీవితాన్ని ఎంత తెలివి తక్కువగా వృథా చేసుకుంటున్నావు!” అన్నయ్య హితోపదేశం నా చెవుల్ని ఊదరగొడుతోంది.

జితేంద్రుడూ నేనూ అప్పుడే తాజూగా రైలుదిగి (మాట వరసకి ఇలా అంటున్నానే కాని, ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాం) అనంతన్నయ్య ఇంటికి వచ్చాం. అతను కలకత్తానించి బదిలీ అయి, పురాతన నగరమైన ఆగ్రాకి ఈమధ్యే వచ్చాడు. అతను ప్రభుత్వంవారి పబ్లిక్ వర్క్స్ శాఖలో సూపర్వయిజింగ్ ఎకౌంటెంటు.

“అన్నయ్యా, నేను వారసత్వం భగవంతుడి దగ్గర్నించి కోరుతున్నానని నీకు బాగా తెలుసు.”

“ముందు డబ్బు; ఆ తరవాతే దేవుడు! ఏమో, ఎవరికి తెలుసు? జీవితం చాలాకాలం సాగవచ్చు.”

“దేవుడే ముందు; డబ్బు ఆయన బానిస! ఏమో, ఎవరు చెప్పగలరు? జీవితం స్వల్పకాలంలోనే ముగిసిపోవచ్చు.”

టకీమని నే నిచ్చిన ఎదురు జవాబు, అప్పటి అవసరాన్నిబట్టి అలా వచ్చిందే కాని, జరగబోయేది ముందే మనస్సుకు తోచి అన్నది కాదు