పుట:Oka-Yogi-Atmakatha.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకోడం

163

రెక్కలు అలిసిపోతాయి. మళ్ళీ ఇంటివేపు దిగివచ్చి, రెక్కలు ముడుచుకొని అణకువగా ఇంటిపట్టున విశ్రాంతి తీసుకోడం చూడకపోము.” నన్ను నిరుత్సాహపరిచే ఈ ఉపమానం ఇంకా నా మనస్సులో ఉన్నందువల్ల ఏమయినా సరే, కలకత్తా వేపు పోనేకూడదని నిర్ధారణ చేసుకున్నాను.

“స్వామీ, నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళనండి. కానీ మీ వెంట ఎక్కడయినా సరే వస్తాను. మీ పేరూ ఎడ్రస్సూ చెప్పండి.”

“స్వామి శ్రీయుక్తేశ్వర్‌గిరి. నా ముఖ్యమైన ఆశ్రమం శ్రీరాం పూర్‌లో రాయ్‌ఘాట్ సందులో ఉంది. మా అమ్మని చూసి కొన్నాళ్ళిక్కడ ఉండి వెళ్దామని వచ్చాను.”

దేవుడు తన భక్తులతో ఆడే ఆట ఎంత తికమకగా ఉంటుందోనని ఆశ్చర్యపోయాను. శ్రీరాంపూర్ కలకత్తాకి పన్నెండుమైళ్ళలో ఉంది. కాని ఆ ప్రాంతాల్లో ఎక్కడా మా గురువుగారు నాకు అగదగల్లేదు. మేము కలుసుకోడానికి, లాహిరీ మహాశయుల జ్ఞాపకాలతో పావనమైన ప్రాచీన కాశీ (వారణాసి) నగరానికి ప్రయాణం కట్టవలసి వచ్చింది. బుద్ధుడు, శంకరాచార్యులు,[1] ఆ తదితర యోగీశ్వరుల పాదస్పర్శతో పవిత్రమైంది ఈ నేల.

  1. భారతదేశపు దార్శనికులందరిలోకీ గొప్పవాడయిన శంకరాచార్యులవారు (శంకరులు) గోవిందయతి శిష్యులు; గోవిందయతి గౌడపాదులవారి శిష్యులు, గౌడపాదాచార్యుల ‘మాండూక్య కారిక’కు శంకరులు రాసిన వ్యాఖ్యానం సుప్రసిద్ధమైనది. తిరుగులేని తర్కంతోనూ రమ్యమైన ప్రసన్న శైలిలోనూ శంకరులు, వేదాంత తత్త్వాన్ని కచ్చితంగా అద్వైత (రెండు కానటువంటి, ఏకేశ్వరతత్త్వ) పరంగా వ్యాఖ్యానించారు. ఈ మహాద్వైతి భక్తిపరమైన స్తోత్రాలు కూడా రచించారు. అమ్మవారిని ఉద్దేశించి వీరు చెప్పిన ‘దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం’లో మకుటం ఇలా ఉంటుంది. “కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి”: దుర్మార్గులైన కొడుకులు ఎందరో ఉన్నప్పటికీ దుర్మార్గురాలైన తల్లి ఎక్కడాఉండదు. శంకరుల శిష్యుడైన సనందనుడు ‘బ్రహ్మ సూత్రా’ లకు (వేదాంత తత్త్వం) భాష్యం రాశాడు. దాని రాతప్రతి అగ్నికి ఆహుతి అయిపోతే (దాన్ని ఒక్కసారి తిలకించిన) శంకరులు, దాంట్లో ఉన్న ప్రతిమాటా తిరిగి శిష్యుడికి అప్పజెప్పారు. ‘పంచపాదిక’ అన్న పేర ప్రసిద్ధమైన ఈ గ్రంథాన్ని ఈ నాటికీ పండితులు, అధ్యయనం చేస్తూ ఉంటారు. సనందనుడనే ఈ శిష్యుడికి మరో కొత్తపేరు రావడానికి చక్కని సంఘటన. ఒకటి జరిగింది. ఒకనాడు ఏటి ఒడ్డున కూర్చుని ఉన్న సనందనుడికి, అవతలి ఒడ్డునుంచి శంకరులు తనను పిలుస్తూ ఉండటం వినిపించింది. వెంటనే అతను నీళ్ళలోకి దిగాడు. అతని విశ్వాసానికీ పాదాలకూ కూడా ఊతగా శంకరులు తమ సంకల్పబలంతో, సుళ్ళు తిరిగే ఆ ఏటిలో తామరపూల బాదు ఒకటి సృష్టించారు; అతను వాటి మీంచి నడుచుకుంటూ వెళ్ళి, అవతలి ఒడ్డుకు చేరాడు. అప్పటినుంచీ ఆ శిష్యుడికి ‘పద్మపాదు’డనే పేరు వచ్చింది. ‘పంచపాదిక’లో పద్మపాదుడు తన గురుదేవులకు భక్తి ప్రపత్తులతో బహుదా జోహార్లు అర్పించాడు. శంకరులే స్వయంగా చక్కగా ఇలా రాశారు: “సద్గురువును పోల్చదగినది ఈ మూడు లోకాల్లోనూ మరొకటి లేదు. చింతామణి అన్నది నిజంగా ఉందనే అనుకున్నప్పటికీ, అది ఇనుమును బంగారంగా మార్చగలదే కాని మరో చింతామణిగా మార్చలేదు. కాని పరమపూజనీయుడైన గురువు, అలా కాకుండా, తన పాదాల్ని ఆశ్రయించిన శిష్యుణ్ణి తనంతవాణ్ణి చేస్తాడు- అంచేత సద్గురువు, సాటిలేనివాడే కాదు, లోకాతీతుడు.