పుట:Oka-Yogi-Atmakatha.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకోడం

159

అనుకొని పొరపడుతున్నావు.” అనుకున్నాను. “కలలు కనేవాడా, ముందుకు నడు.”

పది నిమిషాలయేసరికి నా పాదాలు బాగా తిమ్మిరెక్కేసినట్టు అనిపించింది. కాళ్ళు రాళ్ళయిపోయినట్టయి, అడుగు ముందుకు పడనియ్యలేదు. ఎంతో శ్రమపడి వెనక్కి తిరిగాను; వెంటనే నా పాదాలు మళ్ళీ మామూలుగా అయిపోయాయి. తరవాత మళ్ళీ ఇటు తిరిగాను; విచిత్రమైన బరువు నన్ను అణిచేసింది.

“ఆ సాధువుగారు అయస్కాంత శక్తితో నన్ను దగ్గరికి లాక్కుంటున్నారు!” ఇలా అనిపించేసరికి నా దగ్గరున్న పొట్లాలు హాబూ చేతుల్లో పెట్టేశాను. అతను నేను వేసే తప్పటడుగులు ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు విరగబడి నవ్వాడు.

“ఏమయింది నీకు? పిచ్చెక్కిందా?”

నాలో పొంగిపొర్లే భావావేశం, అతనికి ఎదురుదెబ్బ కొట్టనియ్యకుండా అటకాయించింది. మారు పలక్కుండా అక్కణ్ణించి పరిగెత్తాను.

పాదాలకు రెక్కలు మొలిచినవాడి మాదిరిగా, అడుగులు గాలిలో తేలిపోతూ ఉండగా ఆ సన్నటి సందు దగ్గరికి చేరాను. నేనున్న వేపే నిలకడగా చూస్తున్న ప్రశాంతమూర్తి చటుక్కున నా కంట బడ్డారు. ఆత్రంగా కొన్ని అడుగులు వేసేసరికి ఆయన పాదాల దగ్గరున్నాను.

“గురుదేవా!” వెయ్యి దివ్యదర్శనాల్లో నా కళ్ళకు కట్టిన దివ్య ముఖబింబం ఇదే. కొనదేరిన గడ్డంతో, గిరజాల జుట్టుతో సింహాన్ని తలపించే తల! శుభదృష్టి ప్రసరించే ఈ కళ్ళు, రాత్రివేళల్లో నేను అస్తవ్యస్తమైన ఆలోచనలతో విషాదంలో మునిగి ఉన్నప్పుడు నా వేపు