పుట:Oka-Yogi-Atmakatha.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

ఒక యోగి ఆత్మకథ

సులువుగా మరిచిపోలేకపోయాను. నేను మరో ప్రశ్న అడగడానికి పూనుకొన్నాను.

“స్వామీజీ, మీ ఆదేశం నాకు గందరగోళం కలిగిస్తోంది. అన్నం పెట్టమని నేను ఎన్నడూ అడగననుకోండి, నా కెవరూ ఏం పెట్టరనుకోండి. నేను ఆకలితో మాడి చావవలసిందే.”

“అయితే చావు!” ఈ భయంకరమైన సలహా, గాలిని చీల్చుకుంటూ వినవచ్చింది. “చావవలసే ఉంటే, చావు ముకుందా! దైవబలం వల్లనే కాని తిండిబలం వల్ల బతుకుతానని ఎన్నడూ నమ్మకు! పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించినవాడు ఆయన. ఆకలి పుట్టించినవాడు ఆయన. తన భక్తుడి పాలనా పోషణా ఆయన తప్పకుండా చూసుకుంటాడు. అన్నం నిన్ను బతికిస్తోందని కాని, డబ్బు పోషిస్తోందని కాని మనుషులు పోషిస్తున్నారని కాని అనుకోకు. ఆ ప్రభువు నీ ఊపిరి కాస్తా దిగలాగేస్తే అవేమన్నా నీకు సాయపడతాయా? అవి కేవలం ఆయన ఉపకరణాలు మాత్రమే. నీ కడుపులో ఆహారం జీర్ణమవుతున్నది ఏదో నీ నేర్పువల్లనా? నీ విచక్షణా ఖడ్గాన్ని ఉపయోగించు ముకుందా! ఉపకరణ బంధాల్ని ఛేదించి, ఏకైక కారణమైన భగవంతుణ్ణి దర్శించు!”

నిశితమైన ఆయన మాటలు నాలో, మూలుగలోతుల్లోకి, దూసుకు పోవడం గమనించాను. దైహికావసరాలు ఆత్మను పరాజితం చేస్తాయన్న పాతకాలపు భ్రమ పటాపంచలైంది. పరమాత్మ సర్వసమృద్ధిని అప్పటికప్పుడే ఆకళించుకొన్నాను. వారణాసి ఆశ్రమంలో నేర్చుకొన్న ఈ గుణపాఠం ఉపయోగాన్ని రుజువుచేసే సందర్భం, అనంత యాత్రగాసాగిన నా అనంతర జీవితంలో, ఎన్ని అపరిచిత నగరాల్లో వచ్చిందో!

కలకత్తా నుంచి వచ్చేటప్పుడు నాతో వచ్చిన ఒకేఒక విలువైన వస్తువు, మా అమ్మ దగ్గర్నించి నాకు సంక్రమించిన వెండి రక్ష రేకు- నా